Wednesday, January 22, 2025

కొత్త నోటిఫికేషన్ల కోసం టిఎస్ పిఎస్ సి కసరత్తు షురూ…

- Advertisement -
- Advertisement -

TSPSC exercise begins for new notifications

హైదరాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు షురువైంది. 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లలోని అభ్యర్థుల కొత్త స్థానికతను ఖరారు చేసే ప్రక్రియను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలుపెట్టింది. కమిషన్ పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ను ఇవ్వనుంది. ఆ మేరకు గతంలో ఓటీఆర్ చేసుకున్నవాళ్ళు వాళ్ల కొత్త స్థానికతను నిర్ధారించే విద్యార్హత, చదువుకున్న ప్రాంతాల వివరాలు మరోసారి నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా అభ్యర్థుల స్థానికతను నిర్ధారించి గందరగోళానికి ఆస్కారం లేకుండా టీఎస్పీఎస్సీ నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల గుర్తింపు ఓ కొలిక్కి వచ్చింది. విడతలవారిగా దాదాపు 1 లక్ష ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. వివిధ శాఖల్లో ఇప్పటికే దాదాపు 70 వేల వేకెన్సీలను ప్రభుత్వం గుర్తించింది. మరిన్ని మార్గాల్లో ఖాళీల వివరాలను సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు రిటైర్మెంట్ల ద్వారా ఇటు పదోన్నతుల ద్వారా ఖాళీ ఐన ఫీడర్ పోస్టుల వివరాలను కూడా జిల్లాలవారిగా క్రోడీకరిస్తున్నారు. తద్వారా మరో 30 వేల పోస్టులు అదనంగా వేకెన్సీల జాబితాకు ఎక్కే అవకాశం ఉంది. సీనియర్ అధికారి శేషాద్రి నేతృత్వంలో ఏర్పాటైన ఐఏఎస్ ల కమిటీ కూడా కసరత్తు పూర్తిచేసింది. ప్రస్తుత ఖాళీలకు అదనంగా కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీల్లో కూడా వివిధ శ్రేణుల్లో అవసరమయ్యే పోస్టుల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఇవిపోను జనాభా ప్రాతిపదికన కొత్తగా ఏర్పాటైన నగరపాలకసంస్థలకు నియమించాల్సిన అత్యున్నతస్థాయి అధికారి హోదా, అక్కడ అవసరమయ్యే ఉద్యోగాల వివరాలపై శేషాద్రి కమిటీ ఓ నివేదిక సిద్ధం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది.

అటు 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్దమవుతోంది. 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్ల ఆధారంగా రిక్రూట్మెంట్ కు అవసరమైన మార్పులు, చేర్పులకు శ్రీకారంచుట్టింది. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు త్వరలోనే ఎడిట్ ఆప్షన్ ఇవ్వనుంది. గతంలో ఓటీఆర్ చేసుకున్న వాళ్ళు తమ విద్యార్హతలు, చదువుకున్న ప్రాంతాల వివరాలను మరోసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా కమిషన్ అభ్యర్థుల కొత్త స్థానికతను ఖరారు చేస్తుంది. దీంతో కొత్త జోనల్ వ్యవస్థలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ జరిపేందుకు సర్వీస్ కమిషన్ కు మార్గం సుగమం అవుతుంది.

ఇక 317 జీవో మార్గదర్శకాల ప్రకారం కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లకు ఉద్యోగుల కేటాయింపు, బదిలీల ప్రక్రియ సెంట్ పర్సెంట్ పూర్తైనట్లే. మొత్తం 50 వేలా 900 ల మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. పదుల సంఖ్యలో మినహా అందరూ తమతమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరారు. అతికొద్ది స్పౌజ్ కేసులు మినహా అభ్యంతరాల రూపంలో ప్రభుత్వానికి అందిన అప్పీళ్లు కూడా పరిష్కారమయ్యాయి. ఇక మిగిలింది రిక్రూట్మెంట్లే. అధికారులు ఇచ్చిన సమాచారం, ఖాళీల జాబితా ఆధారంగా త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News