Thursday, January 23, 2025

నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ

- Advertisement -
- Advertisement -

నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ
ఉ.10.30 నుంచి మ. ఒంటి వరకు పరీక్ష
ఉ.8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి
15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
ఉ. 10.15 తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి నో ఎంట్రీ
గత అనుభవాల దృష్టా నిబంధనలు కఠినతరం
అభ్యర్థులు చెప్పులతో మాత్రమే రావాలి…షూ ధరించకూడదు
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 పరీక్షా కేంద్రాలలో ఆదివారం(జూన్ 11) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు టిఎస్‌పిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. గతంలో టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు చేసింది.

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై ఇప్పటికే సిఎస్ సహా ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించే 1,995 మందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఈ పరీక్ష నిర్వహణకు కలెక్టర్లను డిస్ట్రిక్ట్ అథారిటీగా, అడిషనల్ కలెక్టర్లను ఛీఫ్ కో ఆర్డినేటర్లుగా నియమించారు. 994 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లను, 994 లైసనింగ్ అధికారులను, 310 రూట్ ఆఫీసర్లను నియమించారు. వారితో టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, పరీక్షల విభాగం ప్రత్యేకాధికారి బిఎల్ సంతోష్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి, పరీక్షా కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా చర్చించారు. మొత్తం 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీచేసిన టిఎస్‌పిఎస్‌సి, అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న మొత్తం 3,80,032 మందిని ఆదివారం మళ్లీ పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు.

15 నిమిషాల ముందే గేట్లు మూసివేత
గ్రూప్ పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టిఎస్‌పిఎస్‌సి ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు అనుమతించబోమని తెలిపింది. అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి… షూ ధరించకూడదని పేర్కొంది. నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి. జెల్, ఇంక పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు. వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్ చేసే ఓఎంఆర్ షీట్ చెల్లదని టిఎస్‌పిఎస్‌సి. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హాల్‌టికెట్లలో ఫొటో సరిగా లేకపోతే అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని తెలిపింది. గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు, పరీక్ష నిర్వహణ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ శాంతికుమారి, టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్దన్ రెడ్డి వేర్వేరుగా అధికారులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

79.15 శాతం హాల్ టికెట్ల డౌన్‌లోడ్
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు గతంలో మొత్తం 3,80,032 మంది దరఖాస్తు చేసుకోగా, శనివారం సాయంత్రం వరకు 3,00,836 మంది(79.15 శాతం) హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. గతేడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్షకు 2,86,051 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా, ఈసారి సుమారు 15 వేలకుపైగా అభ్యర్థులు అధికంగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌లు
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు టిఎస్‌పిఎస్‌సి ఎస్‌ఎంఎస్‌లు పంపించింది. ఒఎంఆర్ షీట్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా బబ్లింగ్ చేయాలని, మోడల్ ఒఎంఆర్ షీట్‌లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని ఎస్‌ఎంఎస్ ద్వారా అభ్యర్థులు సూచనలు పంపిస్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను చేస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి పాత హాల్ టికెట్లు చెల్లవని, అభ్యర్థులు మళ్లీ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.

పరీక్ష రాసే అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.
ఉదయం 8.30 నుంచి 10.15 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి.
ఉదయం 10.15 తర్వాత గేట్లు మూసివేత.. ఆ తర్వాత పరీక్ష కేంద్రాల్లోని అనుమతి ఉండదు.
హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడీ చూపించాలి.
హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే.. కచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం.. మూడు ఫొటోలు ఉండాలి.
వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు, మొబైల్‌ఫోన్లు వంటి వాటికి అనుమతి లేదు.
అభ్యర్థులు చెప్పులు వేసుకొని మాత్రమే రావాలి…షూ ధరించరాదు.
ఒఎంఆర్ షీట్‌పై బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి.
పెన్సిల్, జెల్, ఇంకు పెన్ను వాడితే జవాబు పత్రాన్ని ఆప్టికల్ మార్క్ స్కానర్ సిస్టం గుర్తించదు.
ఒఎంఆర్ షీట్‌పై వ్యక్తిగత వివరాలు బబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే ఒఎంఆర్ షీట్ మూల్యాంకనం చేయరు.
ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. ఎలాంటి అవకతవకలకు పాల్పడిన క్రిమినల్ కేసు నమోదు చేస్తారు
మాస్ కాఫీయింగ్‌కు పాల్పడిన వారు భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News