Wednesday, January 22, 2025

వారంలో గ్రూప్ 2 నోటిఫికేషన్..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ వారంలో వెలువడే అవకాశం ఉంది. తరువాత వారం నుంచి రెండు వారాల వ్యవధిలో గ్రూప్ -3 నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సమాచారం. గ్రూప్ -2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్ -3లో 1,373 ఉద్యోగాలు భర్తీ చేయనున్నది. గతంలో గ్రూప్- 2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. ప్రభుత్వం గ్రూప్ -2లో మరో 6 రకాల పోస్టులు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఎఎస్‌ఒ, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులును చేర్చింది.

అలాగే గ్రూప్ -3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌ఒడిల్లోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను చేర్చింది. గతంలో ప్రభుత్వం ప్రభుత్వం అనుమతించిన పోస్టులకు అదనంగా తాజాగా అనుమతించిన పోస్టులను కలిపి కమిషన్ ప్రకటనలు జారీ చేయనున్నది. కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి కసరత్తు చేస్తోంది.
వేగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన పోస్టులకు త్వరగా నోటిఫికేషన్లు ఇచ్చేలా టిఎస్‌పిఎస్‌సి చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. గ్రూప్ 1 తుది కీ విడుదలైనప్పటికీ మహిళా రిజర్వేషన్లపై న్యాయస్థానంలో కేసు ఉన్నందున మెయిన్స్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే మెయిన్స్ ఎంపిక జాబితాను టిఎస్‌పిఎస్‌సి ప్రకటించనుంది. గ్రూప్ 1పై త్వరగా న్యాయస్థానం తీర్పు వెలువడితే నోటిఫికేషన్ సమయంలో ప్రకటించినట్లుగా ఫిబ్రవరిలోనే మెయిన్స్ నిర్వహించేందుకు టిఎస్‌పిఎస్‌సి సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

దాంతోపాటు ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ఖరారు చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్ల జారీకి తీవ్ర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మరో 16,940 పోస్టులకు త్వరలోనే ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు ఇటీవల సిఎస్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద ఇప్పటికే 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జరీ చేసేందుకు సిద్ధంగా ఉంది. నియామకాల ప్రక్రియలో కచ్చితంగా సమయపాలన పాటించడంతోపాటు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని ఇప్పటికే సిఎస్ అధికారులు జారీ చేశారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను సూచించారు.
ఇప్పటికే గ్రూప్ 4, జెఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఇప్పటికే 9,168 గ్రూప్- 4 పోస్టులు, 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 4 ఉద్యోగాలకు ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు, జెఎల్ పోస్టులకు ఈ నెల నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. అలాగే రాష్ట్రంలో 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, భూగర్భ జలవనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News