Thursday, January 23, 2025

గ్రూప్ 4 దరఖాస్తు గడువు పొడిగింపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును టిఎస్‌పిఎస్‌సి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. టిఎస్‌పిఎస్‌సి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం(జనవరి 30)తో దరఖాస్తు గడువు ముగియనుండగా, తాజాగా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 8,180 గ్రూప్ 4 పోస్టులకు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కమిషన్ తెలిపింది.

ఆదివారం ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో కమిషన్ దరఖాస్తు గడువును పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్‌లో టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పరీక్షల తేదీలను వెల్లడించిన టిఎస్‌పిఎస్‌సి
ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన పలు ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది. ఏప్రిల్ 25న వ్యవసాయ అధికారి నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 7న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష, మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష, మే 17న ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ పేర్కొంది. అన్ని పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు వ్యవసాయ అధికారి ఉద్యోగాల దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 2 వరకు పొడిగిస్తూ
టిఎస్‌పిఎస్‌సి నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News