Monday, January 20, 2025

టిఎస్‌పిఎస్‌సి సభ్యుడు ఆర్.సత్యనారాయణ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యత నిర్వర్తించే
వాతావరణం లేదని పేర్కొంటూ లేఖ విడుదల విడుదల
తప్పు చేయలేదు..అయినా తప్పుకుంటున్నా : ఆర్.సత్యనారాయణ

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి సభ్యులు ఆర్.సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. తాను ఏ తప్పు చేయలేదు అని, అయినా తప్పుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ్యత నిర్వర్తించే వాతావరణం లేదు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్.సత్యనారాయణ ఒక లేఖను విడుదల చేశారు. ఆర్.సత్యనారాయణ, మాజీ ఎంఎల్‌సి, జర్నలిస్టు అను నేను టిఎస్‌పిఎస్‌సి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. కొత్త కమిషన్ ఆధ్వర్యంలోనే నియామకాలు జరగాలన్న ఉద్యోగార్థుల ఆకాంక్షలను గౌరవిస్తున్నాను అని, ఇప్పుడే కాదు.. తన విద్యార్థి జీవిత కాలం నుంచి కూడా తాను నిరుద్యోగుల పక్షమే అని స్పష్టం చేశారు. ఇక ముందు కూడా నిరుద్యోగుల పక్షమే అని, అందరి ఆశలు, ఆకాంక్షలు వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నానని సత్యనారాయణ పేర్కొన్నారు.

టిఎస్‌పిఎస్‌సిలో పేపర్ల లీకేజీలు లాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎంత మానసిక ఆందోళనకు గురయ్యారో, ఎంత ఆవేదన చెందారో ఒక జర్నలిస్టుగా, ఒక మానవతావాదిగా నేను అర్థం చేసుకోగలను అని ఉద్యోగార్థులను ఉద్దేశించి సత్యనారాయణ లేఖలో పేర్కొన్నారు. ఈ పేపర్ లీకేజీ సంఘటనలు జరిగినప్పుడు కమిషన్ బాధ్యులుగా తాము కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవించామని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని, తీవ్ర అనారోగ్యాలకు గురయ్యామని తెలిపారు. తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగార్తుల ప్రయోజనాలను రక్షించేందుకే అహర్నిశలు కృషి చేశామని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కమిషన్ సభ్యుడిగా తాను నా బాధ్యతను నిర్వర్తించలేని పరిస్థితి నెలకొని ఉందని, ఈ నేపథ్యంలోనే తాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
నేడు మరో ఐదుగురు సభ్యుల రాజీనామా..?
టిఎస్‌పిఎస్‌సిలో ఉన్న మరో ఐదుగురు సభ్యులు బుధవారం రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. సోమవారం(డిసెంబర్ 11) సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయగా, మంగళవారం సభ్యులు ఆర్.సత్యనారాయణ రాజీనామా చేశారు. అదే బాటాలో మిగతా సభ్యులు బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కారం రవీందర్‌రెడ్డి బుధవారం గవర్నర్‌ను కలిసి తమ రాజీనామా లేఖలను అందజేయనున్నట్లు తెలిసింది.తమ రాజీనామాల లేఖలను సమర్పించేందుకు మంగళవారమే కమిషన్ సభ్యులు గవర్నర్ తమిళిసై అప్పాయింట్‌మెంట్ కోరారు.అయితే, ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో బుధవారం రాజీనామా లేఖలను అందజేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News