సకాలంలో వెలువడుతున్న ఫలితాలు
ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లో పెరిగిన విశ్వాసం
ఒక నోటిఫికేషన్‌లో కాకపోయినా మరో నోటిఫికేషన్‌లోనైనా
ఉద్యోగం వస్తుందన్న ధీమాతో ప్రిపరేషన్ కొనసాగింపు
ఎస్‌సి వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం
పొందిన నేపథ్యంలో త్వరలో
కొత్త నోటిఫికేషన్లు వెలువడే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగార్థుల ఆకాంక్షల మేరకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి, సకాలంలో ఫలితాలు వెల్లడిస్తూ నిమాయకపత్రాలు అందజేస్తుండటంతో అభ్యర్థుల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లోని ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించడంతోపాటు ఫలితాలకు ఉన్న అడ్డంకులను తొలగింగి, గత ప్రభుత్వంలో రద్దయిన, వాయిదాపడిన పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. వేగంగా ఫలితాలు వెల్లడించడంతోపాటు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది.
ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి గ్రూప్- 1 పరీక్షలు ఇవే కావటం గమనార్హం. ఎలాంటి అడ్డంగులు, వాయిదాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం ఉద్యోగ నియామక పరీక్షలు జరుగుతుండటంతో అభ్యర్థుల్లో విశ్వాసం పెరిగి సీరియస్‌గా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒక నోటిఫికేషన్‌లో ఉద్యోగం రాకపోయినా మరో నోటిఫికేషన్‌లోనైనా తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందన్న ధీమాతో రేయింబవళ్లు కష్టపడుతున్నారు.
త్వరలో కొత్త నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఎస్‌సి వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో త్వరలోనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. ఎస్‌సి వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మారుతున్న కోచింగ్ విధానం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు పోటాపోటీగా శిక్షణ తీసుకుంటున్నారు.అయితే కాలానుగుణంగా కోచింగ్ విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొవిడ్‌కు ముందు ఎక్కువగా ఆఫ్‌లైన్‌లోనే శిక్షణ కొనసాగగా, కొవిడ్ తర్వాత మాత్రం ఆన్‌లైన్ శిక్షణకు డిమాండ్ పెరిగింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా యాప్‌ల ద్వారా శిక్షణ అందిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో పూర్తి స్థాయి శిక్షణ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు ఆఫ్‌లైన్ శిక్షణపై అంతగా ఆసక్తి చూపడం లేదు.
ఆన్‌లైన్‌లో అయితే ఎక్కడి నుంచైనా క్లాసులు వినడంతోపాటు ఆన్‌లైన్‌లో పరీక్ష రాసే విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు కూడా ఆన్‌లైన్ కోచింగ్‌కే మొగ్గుచూపుతున్నారు. అదే ఆఫ్‌లైన్‌లో అయితే కచ్చితంగా హైదరాబాద్‌కు వచ్చి హాస్టళ్లలో ఉంటూ శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుండటంతోపాటు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉండదు. దాంతో ఎక్కువ శాతం అభ్యర్థులు ఆన్‌లైన్ కోచింగ్‌కే మొగ్గు చూపుతున్నారు.
రేయింబవళ్లు కష్టపడుతున్న అభ్యర్థులు
షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతూ ఫలితాలు వెలువడుతుండంతో నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రంథాలయాలలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. దాంతో రాష్ట్రంలో యూనివర్సిటీలలో గ్రంథాలయాలు, జిల్లా, శాఖ గ్రంథాలయాలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి.