రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టి సారించింది. 8,180 గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి గతేడాది జులై ఒకటో తేదీన గ్రూప్ -4 రాతపరీక్ష నిర్వహించి, ఈ ఏడాది ఫిబ్రవరి 9న మెరిట్ జాబితాను కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పిడబ్ల్యూడి అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలవనున్నారు.
కమ్యూనిటీ, నాన్ క్రిమి లేయర్(బిసిలకు), బిడబ్ల్యూడి సర్టిఫికెట్స్, స్టడీ లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్స్(ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు),ఇతర రిజర్వేషన్లు కలిగి ఉన్న అభ్యర్థులు ఆయా సర్టిఫికెట్లు, వయోపరిమితి సడలింపుకు సంబంధించిన పత్రాలు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని కమిషన్ సూచించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించనిపక్షంలో ఆ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోబోమని టిఎస్‌పిఎస్‌సి స్పష్టం చేసింది.