Monday, December 23, 2024

పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డిఎఒ, ఎఇఇ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను విక్రయించిన విద్యుత్ శాఖ డివిజినల్ ఇంజనీర్ (డిఇ) రమేష్ 80 మందికి పేపర్ అమ్మినట్టుగా గుర్తించారు. ఇందుకుగానూ ఒక్కొక్కరినుంచి రూ. 30 లక్షల బేరం కుదుర్చుకున్నాడు. పూల సురేష్ నుంచి ఎఇఇ పేపర్‌ని రమేష్ తీసుకున్నాడని, అయితే పూల సురేష్‌కు కీలక నిందితుడు ప్రవీణ్ పేపర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్, సురేష్, రమేష్‌లు ఓకే దగ్గర నివాసం ఉండటంతో వీరిమధ్య పరి చయం అయినట్లు సిట్ అధికారులు నిర్దారణకు వచ్చారు. వరంగల్ విద్యుత్ శాఖ డిఇగా ఉన్న రమేష్ తాను పనిచేస్తున్న ఏరియా పరిధిలో పేపర్లు అమ్మాడు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని చాలామంది అభ్యర్థులకు ఎఇఇ పేపర్ ను అమ్మినట్లు విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో పలువురు ప్రజాప్రతినిధుల పిల్లలకు కూడా ఉన్నారు.

ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ఎఇఇ పరీక్షా పేపర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ మండలానికి చెందిన ఓ మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ కూడా తన కూతురు కోసం రమేష్ వద్ద నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఇక, పరీక్షకు ముందు వారిద్దరు ఒకసారి కలిశారని, శ్రీనివాస్‌ను కలిసిన రమేష్ 75 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలోనే సదరు ఎంపిటిసి కూతురు పరీక్ష రాయగా, ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా ఆమెకు రమేష్ జవాబులు చేరవేసినట్లు తెలిసింది. అతడి కూతురికి రమేష్ ఎలక్ట్రిక్ డివైజ్ ఇచ్చాడు. ఈ ఘటనలో ఎంపిటిసితో పాటు ఆయన కూతురును కూడా విచారించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇక, డిఇ రమేష్ పేపర్ ఇచ్చేందుకు గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం కుదర్చు కున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రమేష్‌ను కోర్టు ఆరు రోజుల కస్టడికి అనుమతి ఇచ్చింది. రమేష్ విచారణతో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News