Wednesday, January 22, 2025

ప్రవీణ్ ఫైల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యా ప్తు కొనసాగుతోంది. అసిస్టెంట్ ఇంజినీరింగ్ ప్రశ్నపత్రం మాత్రమే లీకైందని గుర్తించిన టిఎస్‌పిఎస్‌సి అధికారులు ఈ నెల 5న జరిగిన ఎఇ పరీక్షను రద్దు చేసింది. కానీ, ప్రవీణ్ దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌లో ఎఇ ప్రశ్నపత్రంతో పాటు టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానించారు. దీంతో ప్రవీణ్ వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పెన్‌డ్రైవ్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. వాటిని విశ్లేషించిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో మరికొన్ని ప్రశ్నపత్రాలు గుర్తించినట్టు సమాచారం. వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పెన్‌డ్రైవ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

కమిషన్ అధికారులతో సిట్ చీఫ్ సమావేశం తర్వాత అసలు విషయాలు బయటపడ్డాయి. లక్ష్మీ నుంచి ప్రవీణ్ పాస్‌వర్డ్ చోరీపై సిట్ ఆరా తీసింది. 5 పేపర్లను కంప్యూటర్ నుంచి ప్రవీణ్ తీసుకున్నట్టు గుర్తించారు. ప్రవీణ్ కోసం రాజశేఖర్ కంప్యూటర్ లాన్‌లో మార్పులు చేశాడు. రాజశేఖర్ సాయంతోనే ప్రవీణ్ కంప్యూటర్ నుంచి పేపర్లు కొట్టేశాడు. నిందితుడు ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 3 ప్రశ్నాపత్రాలు గుర్తించారు. త్వరలో జరగబోయే పరీక్షల పేపర్లు కూడా రేణుకకు ఇస్తానని ప్రవీణ్ హామీ ఇచ్చాడు. ఎఇ ఎగ్జామ్‌తో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ పేపర్‌ను ప్రవీణ్ తీసుకున్నాడు. అయితే, దీనిపై టిఎస్‌పిఎస్‌సి అధికారులు కానీ, సిట్ అధికారులు కానీ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని, సమాచారం వెల్లడించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 9మంది నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. నిందితుడు ప్రవీణ్ ఎఇ ప్రశ్నపత్రం రేణుకకు విక్రయించగా.. మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఆందోళన
ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎ1 నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 103 మార్కులు రావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్ సాధించిన మార్కులపైనా సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన మెయిన్స్ ప్రిపేరవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు జరుగుతాయా..? లేక ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహిస్తారా..? అని తీవ్రంగా ఆలోచిస్తూ గందరగోళానికి గురవుతున్నారు. నిజానికి పరీక్ష రాసే సమయంలో ప్రవీణ్ తన ఓఎంఆర్ షీట్‌పై బుక్‌లెట్ నంబరును తప్పుగా బబ్లింగ్ చేయడంతో అతడి పేపర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అతణ్ని డిస్‌క్వాలిఫై చేశారు. అయితే, లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో అతడికి ఎన్ని మార్కులు వచ్చాయనే ఆసక్తి నెలకొంది. ‘కీ’ పరిశీలించగా 103 మార్కులు వచ్చినట్టు తేలడంతో అంతా విస్తుపోతున్నారు.

సాధారణంగా గ్రూప్- 1 పోస్టులకు సిద్ధమయ్యే అభ్యర్థులు చాలా సీరియ్‌సగా చదువుతారు. నిరుద్యోగ అభ్యర్థులైతే..ఆరు నెలల నుంచి దాదాపు ఏడాదిపాటు కోచింగ్ తీసుకుంటారు. ఇతర పనులను పక్కనపెట్టి ఇదే పనిలో ఉంటారు. అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారైతే ఈ పరీక్షకు సన్నద్ధం కావడం కోసం కొంతకాలంపాటు సెలవు పెట్టి మరీ చదువుకుంటారు. ఇంతగా కష్టపడ్డ చాలా మందికి ఈ పరీక్షల్లో 70 నుంచి -80 మార్కులే వచ్చాయి. మరింత సీరియ్‌స్‌గా చదివినవారికి సైతం 100 మార్కులు దాటలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. అలాంటిది.. ఒక్కరోజు కూడా ఉద్యోగానికి సెలవు పెట్టకుండా, ఎలాంటి కోచింగూ తీసుకోకుండా పరీక్ష రాసిన ప్రవీణ్‌కు ఇన్ని మార్కులు రావడానికి కారణం పేపర్ లీకేజీనే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఈ పేపర్ ఆధారంగా ప్రవీణ్ తానొక్కడే చదివి పరీక్ష రాశాడా…? లేక లీకైన పేపర్‌ను మరింకెవరికైనా అందించాడా అనే కోణంలో కూడా అభ్యర్థుల్లో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్నాపత్రాలు
ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో టిఎస్‌పిఎస్‌సి కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో జరిగే అన్ని పరీక్షలతో పాటు భవిష్యత్తులో జరిగే అన్ని పరీక్షల ప్రశ్నాపత్రాలను కొత్తగా రూపొందించాలని నిర్ణయించింది. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో అంతర్గత భద్రతకు సంబంధించి పకడ్బంధీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే రూపొందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News