Wednesday, January 22, 2025

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినవారిలో నీలేష్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్, షమీమ్, సురేశ్ మరో ముగ్గురు ఉన్నారు. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిట్ విచారణకు సహకరిం చాలని ఆదేశించింది. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఇప్పటికే ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రేణుక, రమేశ్, ప్రశాంత్ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కాగా వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఏ-1 ప్రవీణ్ కుమార్, ఏ-2 రాజశేఖర్, ఏ-4 ఢాక్యా నాయక్, ఏ-5 రాజేశ్వర్ నాయక్ సహా మొత్తం ఐదుగురు నిందితులు బెయిల్ కోసం శుక్రవారం నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

మార్చి 13న బేగంబజార్ పోలీసులు రేణుకతో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రేణుక చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేణుక అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు తన కుమార్తె బాగోగులు చూడాల్సిన బాధ్యత ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలన్న ఆమె తరఫు న్యాయవాది వాదనను కోర్టు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రమేశ్, ప్రశాంత్ రెడ్డికి సైతం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రమేశ్ బెయిల్ ఆర్డర్‌ను చంచల్‌గూడ జైలుకు సకాలంలో అందించకపోవడంతో ఆయన శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన పూచీకత్తులు సమర్పించకపోవడంతో కోర్టు ఇంకా బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News