Sunday, January 19, 2025

మోడీ మాటలు.. గురువింద గింజ సామెత.. రెండూ ఒకటే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వరంగల్ సభలో ప్రధాని ప్రసంగం ఆద్యంతం అవాస్తవాలు, వక్ర భాష్యాలు తప్ప మరేం లేదన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం అబద్దమే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వకుండా వివక్ష చూపుతున్న మోడీ ఆ వీరవనితల పేర్లతో ప్రసంగాన్ని ప్రారంభించడం వారిని అవమానించడమేనని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును తొమ్మిదేళ్లుగా నాన్చుతున్న మోడీ గిరిజన బిడ్డల సంక్షేమం కోసం ఏదో చేశామని వారి జీవితాలను పూర్తిగా మార్చేశామని గాలి మాటలు మాట్లాడిపోయారు.

తెలంగాణ ప్రభుత్వ పాలనలో ఏజెన్సీలు బాగుపడ్డాయి. గిరిజన బిడ్డల సంక్షేమానికి గురుకులాలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం వారికి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది. బడుగులను, దళితులను,గిరిజనులను కడుపులో పెట్టుకొని చూసుకుంటోంది. కానీ దళితులు గిరిజనులు ఆదివాసీలను తొమ్మిదేళ్లుగా మోసగిస్తున్న పార్టీ బిజెపి, ఎస్టీ రిజర్వేషన్లు పక్కన పెట్టి గిరిజన బిడ్డలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో అన్యాయం చేస్తున్నదని ఆయన వెల్లడించారు. ఇవన్నీ ఎవరికీ తెలియనట్టు మోడీ వరంగల్ కు వచ్చి గురివింద గింజ సామెత లాగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మోడీ సర్కారు 9 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది వీసమెత్తు కూడా లేదన్నారు. కానీ వరంగల్ సభలో భారీ ప్రగల్భాలు పలికారు. తెలంగాణ సర్కారు ఏమీ చేయకపోతే తెలంగాణ పల్లెలకు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఎలా ఇస్తుందో చెప్పాలి? అని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ అవార్డులు ఎలా వస్తున్నాయో కూడా మోడీ చెప్పాలన్నారు. తెలంగాణలో అన్ని కేంద్ర ప్రభుత్వమే చేస్తే మరి మిగతా బిజెపి ఫలిత రాష్ట్రాల్లో ఆ స్థాయి అభివృద్ధి ముందు కనిపించడం లేదో మోడీ చెప్తే బాగుంటుందన్నారు.

విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ మోడీ సొంత రాష్ట్ర మైన గుజరాత్ కు పట్టుకుపోయి 20 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చుకొని.. ముష్టి ఐదు వేల కోట్లతో తెలంగాణలో వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రకటించి దాన్ని కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్న కిషన్ రెడ్డి, ఇతర నాయకులు సమర్ధించుకోవడం వారికి రాష్ట్రంపై ప్రేమ ఎంత ఉందో, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడం పైన ఎంత పట్టింపు ఉందో స్పష్టం చేస్తోందన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ స్కూల్ లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్న సతీష్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూలిపోయిన పురాతన భవనాల్లో, వందలాది మంది విద్యార్థులకు ఒకరిద్దరు టీచర్లతో నడుస్తున్న స్కూల్స్ గురించి మోడీకి తెలియదా..? తెలంగాణలో కార్పొరేట్ స్కూళ్లకంటే అత్యద్భుతంగా భవనాలు కట్టుకున్నాం. కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నాం. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్న వారి సంఖ్య 75 శాతానికి పెరిగిందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చి ఓట్లు వేయించుకునే పన్నాగం తప్ప మోడీ  మాటల్లో ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా లేదు. మోడీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ఇక్కడి ప్రజలకు తెలుసు. ప్రపంచమంతా కూడా ఆ అభివృద్ధిని చూసి ప్రశంసిస్తోంది. మీరు వచ్చి నాలుగు అబద్ధాలు చెప్పినంత మాత్రాన 9 ఏళ్ల అభివృద్ధి కనబడకుండా పోదన్నారు. ఇకనైనా విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులిస్తే బాగుంటుందని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News