సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం
సమూల మార్పులు తీసుకువస్తాం
ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ ఎండి సజ్జనార్
హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధి, విధానాలతో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించే అవకాశం ఉందని, ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారని ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, వైస్ చైర్మన్ అండ్ ఎండి సజ్జనార్‌లు పేర్కొన్నారు. టిఎస్ ఆర్టీసి అభ్యున్నతికై ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రయాణికుల రవాణా అవసరాలు, సంస్థ పురోభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం కోసం సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఆదేశాల మేరకు ఉన్నతాధికారుల బృందం వివిధ రాష్ట్రాల్లోని రవాణా సంస్థల విధి విధానాలను, అక్కడి రవాణా సౌకర్యాల స్థితిగతులపై ఈ నెల 20, 21వ తేదీల్లో పూర్తిగా అధ్యయనం చేసి వచ్చింది. ఈ పర్యటనలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఈడి (ఒ), సంస్థ కార్యదర్శి పి.వి. మునిశేఖర్, ఈడి (ఇపి అండ్ ఎఎమ్) సి.వినోద్, ఈడి (కరీంనగర్) వెంకటేశ్వర్లు, ఈడి (జిహెచ్‌జడ్) ఇ.యాదగిరిల నేతృత్వంలో మొత్తం ఐదుగురు అధికా రుల బృందం వేర్వేరుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి రవాణా సంస్థల పనితీరును పరిశీలించి ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది.
చైర్మన్, వైస్ చైర్మన్‌లతో బస్‌భవన్‌లో సమావేశం
అక్కడి రవాణా సంస్థల ఆర్థిక స్థితి మెరుగుదల, రవాణా, సామర్థ్యం, బస్సుల కొనుగోళ్లు, బస్‌స్టేషన్ల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాల కల్పన, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రాయితీలు, మార్కెటింగ్ స్కీమ్‌లు, ఖర్చులు, నియంత్రణ, టిక్కెటేతర ఆదాయ మార్గాలు, అద్దె బస్సుల నిర్వహణ వంటి వివిధ అంశాలపై అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ విషయమై అధికారుల బృందం శుక్రవారం బస్‌భవన్‌లో సమావేశమై ఆయా రాష్ట్రాల్లో తాము పరిశీలించిన విషయాలను చైర్మన్, వైస్ చైర్మన్‌లతో వారు పంచుకున్నారు. సంస్థలో అమలు చేయగలిగే ఉత్తమ విధానాలు, మరింత మెరుగైన రవాణా సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన సరికొత్త చర్యలు, అవకాశాలను వారు వివరించారు. ఈ మేరకు అమలు చేయాల్సిన అంశాలను క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించాలని సంబంధిత అధికారులను చైర్మన్, వైస్ చైర్మన్‌లు ఆదేశించారు. అధ్యయన అంశాలను పరిశీలించిన అనంతరం వాటిలో ఉత్తమ అంశాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు చేపడతామని వారు తెలిపారు.