రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ప్రయాణికుల కోసం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు ఎనిమిది రోజుల ముందుగానే టికెట్‌ను బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు ఉండదని ప్రకటించింది. ఎనిమిది రోజుల ముందుగానే బుకింగ్ చేసుకోడానికి http://tsrtconline.in వెబ్‌సైట్ విజిట్ చేయాలని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గాల్లో ప్రయాణిస్తే….
హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు టిఎస్ ఆర్టీసి బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. తిరుగు ప్రయాణ టికెట్‌పై ఈ రాయితీ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసి అధికారులు వెల్లడించారు.
శ్రీశైలంకు బస్సు సర్వీసులు పెంచాలని…
కాగా, వేసవి నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎపిలోని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. యాత్రికుల సంఖ్య పెరగడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి ప్రాంతాల నుంచి శ్రీశైలంకు బస్సు సర్వీసులు, ఫ్రీక్వెన్సీని పెంచాలని టిఎస్ ఆర్టీసి నిర్ణయించింది. ఈ బస్సు సర్వీసులు ఎంజిబిఎస్ నుంచి తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. రాత్రి 11:45 వరకు కొనసాగుతాయి. యాత్రికులు వారి ప్రయాణ అభిరుచికి తగ్గట్లుగా రాత్రి లేదా పగలు సమాయాల్లో ఈ బస్సు సర్వీసులను వినియోగించుకోవచ్చని ఎండి సజ్జనార్ పేర్కొన్నారు.
పార్క్ ఎంట్రీ టికెట్‌పై 15 శాతం రాయితీ
హైదరాబాద్‌లోని వండర్ లాకు టిఎస్ ఆర్టీసి బస్సులో ప్రయాణించే వారికి ఆర్టీసి సూపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. టిఎస్ ఆర్టీసి బస్సులో వండర్ లాకు వెళితే పార్క్ ఎంట్రీ టికెట్‌పై 15 శాతం రాయితీ పొందొచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వండర్ లాకు టిఎస్ ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణించి వండర్ లాకు వచ్చే వారికి పార్క్ ఎంట్రీ టికెట్‌పై 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉందని ఆర్టీసి అధికారులు తెలిపారు.