ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో అమల్లోకి ?
ఇప్పటికే చార్జీల పెంపుపై మంత్రి, ఆర్టీసి చైర్మన్, ఎండిల సమీక్ష
హైదరాబాద్: మరోసారి చార్జీలను పెంచేందుకు టిఎస్ ఆర్టీసి సిద్ధమైంది. ఇప్పటివరకు రౌండ్ ఫిగర్, డీజిల్ సెస్, టోల్ సెస్, బస్‌పాస్ చార్జీలను, ప్యాసింజర్ సేఫ్టీ సెస్ అంటూ దాదాపు 35 శాతం వరకు టిఎస్‌ఆర్టీసి చార్జీలు పెంచగా మరోమారు టికెట్ చార్జీలను పెంచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అన్ని రకాల చార్జీలను పెంచినా ఆర్టీసి నష్టాలు పూడకపోవడంతో మరోసారి టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. సగటున 20 నుంచి 30 శాతం వరకు చార్జీలను పెంచుకునేందుకు ఆర్టీసి అధికారులు గతంలో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపగా త్వరలోనే దీనికి ఆమోదం లభించే అవకాశం ఉందని ఆర్టీసి అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, టికెట్ ధరల పెంపు ఉంటుందని పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటివారంలో చార్జీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆర్టీసి అధికారుల ప్రతిపాదనల ప్రకారం 100 కిలోమీటర్ల లోపు 30 శాతం టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
కొన్ని మార్పులు, చేర్పులతో మరోసారి సిఎంకు నివేదిక
ఇక దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు (డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ) బస్సుల్లో 20 శాతం చార్జీల పెంపు ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. పల్లె వెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 10 శాతం చార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ చార్జీల పెంపుతో రోజువారీ నష్టాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా పెంచినా సగటున కిలోమీటరుకు టికెట్ పై రూ.2 నుంచి రూ. 3 వరకు పెరుగుతుందని ఇప్పటికే చార్జీల పెంపునకు సంబంధించి మంత్రి పువ్వాడ, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి, ఎండి సజ్జనార్‌లు సమీక్షించినట్టుగా తెలిసింది. ఆర్డినరీ, సిటీ బస్సులపై కిలోమీటరుకు 25 పైసలు, ఆపై బస్సులపై 30 పైసలు చొప్పున ప్రతిపాదించినట్లు మంత్రి అజయ్ కూడా గతంలోనే ప్రకటించారు. వీటిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి, మరోసారి సిఎంకు నివేదించినట్లు అధికారవర్గాల సమాచారం. దీనికి ఆమోదం లభిస్తే త్వరలోనే పెరిగిన ఆర్టీసి బస్ టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటికే అదనపు డీజిల్ సెస్ ధరల పెంపుతో….
ఇప్పటికే అదనపు డీజిల్ సెస్ ధరలను పెంచడంతో ప్రయాణికులపై భారీగా భారం పడింది. గతంలో పెంచిన అదనపు డీజిల్ సెస్‌తో పల్లెవెలుగులో ప్రయాణించే ప్రయాణికులకు రూ.5 నుంచి రూ.45లు, (250 కి.మీల) వరకు, ఎక్స్ ప్రెస్ రూ.5 నుంచి రూ.90లు, (500 కి.మీ వరకు), డీలక్స్ రూ.5 నుంచి రూ.125లు, (500 కి.మీల) వరకు సూపర్‌లగ్జరీ రూ.10 నుంచి రూ.130లు, (500 కి.మీల) వరకు, ఏసి సర్వీసులు రూ.10ల నుంచి రూ.170లు, (500 కి.మీల) వరకు దూరానికి చార్జీలను ప్రయాణికులు చెల్లిస్తుండగా, మరోసారి చార్జీలు పెరిగితే భారీగా భారం పడుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.