శివరాత్రి సందర్భంగా భక్తులకు ఆర్టీసి ఆఫర్
భక్తుల సంతృప్తే లక్షంగా సేవలు అందించేందుకు సిద్ధం
ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: 30 మంది ప్రయాణికులు ఉంటే ఇంటికే ఆర్టీసి బస్సును పంపిస్తామని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఈ సేవలను ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. భక్తుల సంతృప్తే లక్షంగా సేవలు అందించేందుకు కార్యాచరణను ప్రవేశపెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రయాణంపై చింతవద్దని, టిఎస్ ఆర్టీసి ఉండగా మీరు కలత చెందవద్దని ఎండి సూచించారు. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు, పుణ్య తీర్ధాలకు వెళ్లాలనుకునే వారు కనీసం 30 మంది ఉంటే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఎండి తెలిపారు. ఈ సేవలు అవసరమైన భక్తులు సమీపంలోని ఆర్టీసి డిపో మేనేజర్ లేదా కాల్‌సెంటర్ 040 30102829, 040 68153333లో సంప్రదించాలని ఎండి సూచించారు. పర్వదిన సమయాల్లో, జాతర, ప్రత్యేక సందర్భంలోనే కాకుండా ఎప్పుడైనా ఆర్టీసి తన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉందని ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రయాణికుల ఆదరణను మరింత చూరగొనేందుకు సంస్థ తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.
ఎండి నూతన కార్యాచరణతో ముందుకు
ప్రస్తుతం ఆర్టీసి ఎండి అమల్లోకి తీసుకొస్తున్న సంస్కరణలు ఆ సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. అందులో భాగంగా ఎండి నూతన కార్యాచరణతో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో భక్తుల సంతృప్తే లక్షంగా సేవలు అందించేందుకు పలు కార్యక్రమాలకు ఆర్టీసి శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం సంస్థ తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యలు ప్రజా రవాణాకు ఊతమిస్తున్నాయి. రానున్న రోజుల్లో టిఎస్ ఆర్టీసి చేస్తున్న ప్రయత్నాలు సంస్థ అభివృద్ధికి ఆశాజనకంగా ఉపయోగపడనున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు.