గోషామహల్: శ్రీశైలం పుణ్య్రత్రానికి అంతర్రాష్ట బస్సు సర్వీసులను క్రమబద్దీకరిస్తున్నట్లు టిఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఎ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవులు, కొత్త బస్సులు అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలం క్షేత్రానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. శ్రీశైలం వెళ్లే భక్తుల రద్దీ అధికంగా ఉంటే ఎంజిబిఎస్ నుండి ప్రతి 20 నిమిషాలకు, సాధారణ రద్దీ ఉంటే ప్రతి అరగంటకు ఒక బస్సు సర్వీసు నడిపే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
తిరుగు ప్రయాణంలోనూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం నుండి ఎంజిబిఎస్‌కు అరగంటకు ఒక బస్సు నడుపుతున్న ట్లు పేర్కొన్నారు. శ్రీశైలం వెళ్లే మొదటి బస్సు తెల్లవారుజామున 3:30 గంటలకు ఎంజిబిఎస్ నుండి బయల్దేరుతుందని, చివరి బస్సు రాత్రి 11:45 గంటలకు ఎంజిబిఎస్ నుండి శ్రీశైలానికి బయల్దేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుండి తెల్లవారు జామున 4:30 గంటలకు మొదటి బస్సు ఎంజిబిఎస్‌కు బయల్దేరుతుందని, చివరి బస్సు రాత్రి 8 గంటలకు బయల్దేరుతుందని రీజనల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు.