పండగ పేరుతో ఇతర ప్రాంతాలకు మళ్ళింపు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
మనతెలంగాణ, సిటీబ్యూరో: శివారు ప్రాంతాల అధికారులు నడిపే బస్సులే అంతంత మాత్రమే. వాటి ద్వారా ఆయా ప్రాంతాలు ప్రజలకు వచ్చే ప్రయోజనం కూడా తక్కువే. అయితే పండగలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వాటిని కూడా అదనపు బస్సులపేరుతో ఇతర ప్రాంతాలకు మళ్ళిస్తే వారి కష్టాలు చెప్పనలవి కాదు. దసరా పండగ పేరుతో ఆర్టిసి అధికారులు దూర అదనపు బస్సులను నడుపుతున్నారు.ఉన్న బస్సులు సరిపోక పోవడంతో కొన్ని బస్సులను నగరంలోని పలు డిపోల నుంచి సిటీ బస్సులను విజయవాడ,గుంటూరు, తదితర ప్రాంతాలకు నడుపుతున్నారు.ప్రతి రోజు శివారు ప్రాంతాలకు నడిపే సాధారణ బస్సుల్లో 60 శాతం బస్సులను అదనపు బస్సుల కింద నడుపుతుండటంతో శివారు ప్రాంతాల నుంచి రోజు వారీ కార్యకలపాలకు వచ్చే సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పండగ పేరుతో అదనపు బస్సులు వేస్తే మాకు అభ్యంతరం లేదు కాని శివారు ప్రాంతాలకు కేటాయించిన బస్సులను దూర ప్రాంతాలకు తరలిస్తే మా పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పండగలు వచ్చాయంటే మా ప్రాంతాలకు సిటీ బస్సులను తగ్గించిన ఇతర ప్రాంతాలకు ఆయా బస్సులను నడపడం అధికారులకు రివాజుగా మారిందని విమర్శిస్తున్నారు. పండగల సందర్భంగా అధికారులు బస్సులను ఇతర ప్రాంతాలకు మళ్ళించడంతో తాము ఆటోలను,క్యాబ్‌లలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్ని సందర్భల్లో వారు సిటీలోకి రావడానికి ఇష్టపడటం లేదని దాంతో వారు అడిగినంత సమర్పించుకోవాల్సి వస్తుందంటున్నారు.
అంతే కాదు ఆటో వాలాలు నలుగురు పట్టే ఆటోల్లో వారు పది మంది ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని, పరిమితికి మించిన ప్రయాణికులతో నడుస్తున్న ఆటోలు ఏదైనా ప్రమాదానికి లోనయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. నగరంలో తరచు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూస్తుంటే ఆందోళన కలగుతోందని ఈ నేపథ్యంలో తాము వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి బస్సులను ఆశ్రయిస్తున్నామని ఇటువంటి సందర్బాల్లో శివారు ప్రాంతాలకు వచ్చే బస్సులను ఈ విధంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.