డ్యూటీ లో స్మోకింగ్ ను ప్రశ్నించిన “మాచన”
క్షమాపణ చెప్పిన బస్ భవన్
డ్రైవర్ పై విచారణకు ఆదేశం
హైదరాబాద్: పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ కు ఆర్టీసీ బస్ లో చేదు అనుభవం ఎదురైంది. బస్ నడుపుతూ దమ్ము కొట్టవద్దు అని డ్రైవర్ ను మందలించినందుకు రఘునందన్ పట్ల ఆ డ్రైవర్ అమర్యాదగా.. అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఉదంతం బుధవారం
ఇబ్రహీంపట్నం వద్ద చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే..పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటి తాశిల్దార్ మాచన రఘునందన్ ఎమ్ జి బి ఎస్ నుంచి మార్కాపురం వెళ్తున్న బస్,టి ఎస్ 09జడ్ 7919 ను ఇబ్రహీంపట్నం లో ఎక్కారు. హైదరాబాద్ 1 డిపో కు చెందిన ఆ ఆర్టీసీ బస్..కొద్ది దూరం వెళ్ళగానే..డ్రైవర్ సిగరెట్ తాగుతున్నాడు అన్న విషయం రఘునందన్ గమనించాడు.మీరు డ్యూటి లో ఉండగా సిగరెట్ తాగడం పద్ధతి కాదు అని రఘునందన్ హెచ్చరించారు.
‘ఇందుకు బదులుగా డ్రైవర్ ,కటువుగా,కర్కశంగా సమాధానం ఇస్తూ..నువ్వటు పక్కకు పోయి కూర్చో అని గదమాయించి చెప్పాడు. డ్యూటి లో..ఉన్న డ్రైవర్ తప్పు చేయడమే గాక, మందలించిన తన పట్ల దురుసు గా ప్రవర్తిస్తున్నాడని గ్రహించిన రఘునందన్ డ్రైవర్ సిగరెట్ తాగుతున్న ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. దీంతో తనను సిగరెట్ తాగుతున్నపుడు ఫోటో తీస్తున్న సంగతి గమనించిన డ్రైవర్.. ఏయ్..ఏమ్ చేస్తున్నావ్, నువ్వో వేస్టు గానివి” అని అగౌరవపరిచాడు. అనుచితంగా మాట్లాడాడు. అనవసరం గా..నిన్ను ఎక్కించుకున్నా..అసలు ఆపేదేలేకుoడే అంటూ..తన వద్ద ఉన్న అగ్గి పెట్టె ను విసురుగా పారేశాడు. జరిగిన ఉదంతాన్ని ఆర్టీసీ అధికారుల కు ఎక్స్(ట్విట్టర్) ద్వారా.. రఘునందన్ ఆర్టీసి కి తెలియపరిచాడు. సదరు డ్రైవర్ పై దయచేసి చర్య తీసుకోవాలని ఆర్టీసీ ఎం డి తో పాటు హైదరాబాద్ 1 డిపో అధికారులను కోరారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ, జరిగిన ఉదంతం పై విచారణ జరిపి డ్రైవర్ పై చర్య తీసుకోవాలని హైదరాబాద్ 1డిపో అధికారుల ను ఆదేశించారు. జరిగిన సంఘటన పట్ల “సారి” చెప్పారు.మీకు కలిగిన అసౌకర్యానికి క్షంతవ్యులం అని రఘునందన్ కు క్షమాపణ చెప్పారు.