నిరుద్యోగ యువత ఆసక్తి చూపాలని పిలుపునిచ్చిన మంత్రి హరీశ్
సిద్ధిపేట ఆర్టిసి డిపోలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట: అనుభవం కలిగిన వారితో శిక్షణ.! డ్రైవింగ్‌తో పాటు మెకానిక్ మెలకువలపైనా బోధన.! అదీ పూర్తయ్యాక సులభంగా లైసెన్స్ జారీ.! ఆర్టిసి డ్రైవర్ల నియమకాల్లోనూ ప్రాధాన్యం ఉంటుందని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు యువతకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్టిసి డిపోలో హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, జెండా ఊపి శిక్షణ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఈ డ్రైవింగ్ శిక్షణతో స్వయం ఉపాధి పొందే అవకాశం ఉన్నదని, రాబోయే రోజుల్లో మండలాల వారీగా గుర్తించి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేలా చూస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. నెల రోజుల పాటు జరిగే శిక్షణకు మొదటి బ్యాచ్ ఒక్కొక్కరికీ రూ.15 వేల 600 రూపాయలు ఫీజుగా నిర్ణయించామని, ఎస్సి కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువత 30 మందికి 4 లక్షల 68 వేలు ప్రభుత్వమే వెచ్చించినట్లు మంత్రి చెప్పారు.
లైసెన్సు మంజూరుకు తోడ్పాటు.!
శిక్షణ అనంతరం నిర్ణీత పరీక్షల్లో పాసైన వారికి ధ్రృవపత్రం జారీ చేస్తామని, హెవీ మోటార్ వెహికల్ లైసెన్సు మంజూరుకు ఆర్టిసి అధికారులే చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఆయా కులాల కార్పొరేషన్లే ఫీజు చెల్లిస్తున్నామని, భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణతో స్థిరమైన ఆదాయంతో కూడిన ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెబుతూ సిద్ధిపేట ఆర్టిసి ప్రారంభించిన సరికొత్త శిక్షణా కార్యక్రమంలో నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఔత్సాహిక యువత నేరుగా ఆర్టీసీ డిపోను సంప్రదించాలి
మెరుగైన, స్థిరమైన ఉపాధి అవకాశాల దిశలో ఈ శిక్షణ పొందాలంటే ఔత్సాహిక యువత నేరుగా ఆర్టిసి డిపో సంప్రదించి రూ.15, 600 రూపాయలు చెల్లించి శిక్షణ, లైసెన్సు పొందాలని సూచించారు. కేవలం భారీ వాహనాల శిక్షణ, లైసెన్సు జారీ చేయడమే కాదని, మరో వివిధ రకాలైన 23 శిక్షణ కోర్సులు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టిసి ఆర్ఎం రాజశేఖర్, డిఎం రామ్మోహన్ రెడ్డి, ఎస్సి కార్పోరేషన్ ఇడి రామాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరామ్, మాజీ చైర్మన్ రాజనర్సు, డిపో సిబ్బంది, శిక్షణార్ధులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.