చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడికి శిక్షపడేలా
చేసినందుకు ఆర్టీసి జేడిపై సజ్జనార్ ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్: చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్, ఐపీఎస్ అభినందించారు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో గురువారం ఆయన్ను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పనితీరును ఎండి ప్రశంసించారు. 16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.
జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీగా, ప్రస్తుతం టిఎస్ ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపిఎస్ ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవచూపారు. 2018 జూన్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.