Wednesday, January 22, 2025

ఆర్టీసిలో ఖాళీల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు

- Advertisement -
- Advertisement -

ఆర్టీసిలో ఖాళీల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఆర్టీసిలో పదేళ్లుగా లేని నియామకాలు
ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల ముందస్తు ప్రణాళికలు
త్వరలోనే ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం!
ఏడేళ్లలో 11,765 మంది తగ్గిన ఉద్యోగులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టీసిలో ఉద్యోగులు భారీగా తగ్గిపోతున్నారు. 2013లో ఆర్టీసిలో ఉద్యోగాల భర్తీ జరగ్గా అప్పటి నుంచి కొత్తగా ఉద్యోగులను ఆ సంస్థ తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే సంస్థలో ఖాళీల భర్తీ కోసం ఆర్టీసి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఖాళీల భర్తీలో భాగంగా డ్రైవర్లు, సూపర్‌వైజర్‌లతో పాటు కండక్టర్‌ల నియామకం కోసం ఈ ప్రతిపాదనలను ఆర్టీసి అధికారులు ప్రభుత్వానికి పంపారు. రానున్న రోజుల్లో చాలామంది రిటైర్‌అయ్యే అవకాశం ఉండడంతో సంస్థకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసి ముందస్తుగా ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్టీసి సంస్థ ఇటీవల కారుణ్య నియామకాల కింద 116 మందిని కానిస్టేబుళ్లుగా నియమించింది.

2015-16 సంవత్సరంలో సంస్థలో 55,993 మంది ఉద్యోగులు
2015-,16 సంవత్సరంలో సంస్థలో 55,993 మంది ఉద్యోగులుండగా, 2022 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 49,228కి చేరుకుంది. 2011,-12 సంవత్సరంలో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసునే ఆ తర్వాత సంవత్సరాల్లో దశల వారీగా సంస్థ క్రమబద్ధీకరించింది. రానున్న అయిదేళ్ల(2023 నుంచి -2027) సంవత్సరం వరకు 10,307 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో డ్రైవర్లు 3484 మంది కాగా, కండక్టర్లు 3245. మిగిలిన వారు గ్యారేజీ, భద్రతాసిబ్బంది, సూపర్‌వైజర్లు, అధికారులు ఉన్నారు. మొత్తంగా చూస్తే 2023లో 2325 మంది ఉద్యోగులు, 2024లో 2196 ఉద్యోగులు, 2025లో 1859 ఉద్యోగులు, 2026లో 2000 మంది ఉద్యోగులు, 2027 సంవత్సరంలోలో 1927 మంది ఉద్యోగులు రిటైర్ కానున్నారు.

ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసి ప్రాధాన్యం
ఇంధన వ్యయం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసి ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసి వద్ద బస్సుల కొనుగోళ్లకు నిధులు లేకపోవడంతో ప్రైవేటు సంస్థల నుంచి అద్దెకు తీసుకుని కిలోమీటర్ల వారీగా డబ్బు చెల్లిస్తోంది. ఈ బస్సుల్లో డ్రైవర్లు ఆ సంస్థకు చెందినవారే ఉంటారు. ఇటీవల 3 వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. దీంతో తమ ఉద్యోగాలు పోతాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు 2015-, 16లో 10446 బస్సులుంటే 2022 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 9092కు తగ్గింది. 2025 నాటికి 70 శాతం అద్దె బస్సులే ఉండే అవకాశం ఉందని కార్మికులు వాపోతున్నారు.

620 మంది కార్మికుల విఆర్‌ఎస్
కొత్తగా నియామకాలు లేకపోవడంతో మిగిలినవారిపై పనిభారం పెరుగుతోందని పలువురు కార్మికులు వాపోతున్నారు. డబుల్ డ్యూటీలు, అదనపు పనిగంటలు చేయాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశపెడితే 620 మంది కార్మికులు విఆర్‌ఎస్ తీసుకున్నారు. సగటున ఏటా 250 మంది కార్మికులు అనారోగ్య కారణాలతో చనిపోతున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తుండడంతో వీటికి చెక్ పెట్టాలని ఆర్టీసి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా తెలిసింది. త్వరలోనే ప్రభుత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News