Monday, December 23, 2024

ప్యాసింజర్ సెస్ పేరుతో బస్సు చార్జీలను పెంచిన టిఎస్ ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

TSRTC raises bus fares in name of passenger cess

డీలక్స్ బస్సుల్లో రూ.5లు, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడలో రూ.10లు పెంపు
రెండు నెలల్లో 4,250 బస్సుల్లో అందుబాటులోకి రానున్న వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్
ఇది అమల్లోకి వస్తే ఇన్ఫర్మేషన్ సెస్ పేరిట ఒక్కో టికెట్‌పై రూ.15లు పెరిగే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్ : టిఎస్ ఆర్టీసి బస్సు చార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5ల చొప్పున, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10ల వరకు టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టిఎస్ ఆర్టీసి వెల్లడించింది. బస్టాండ్లలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ తదితర లగ్జరీ బస్సుల్లో వెళ్లివచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా కుర్చీలు, బెంచీలు, ఫ్యాన్లు, రిజర్వేషన్ కౌంటర్లు, సామాన్లు భద్రపరుచుకునే గది, టాయిలెట్స్ తదితర ఏర్పాట్లు చేస్తున్నందుకు రూ.1చొప్పున వసూలు చేసేందుకు గతంలో ప్రభుత్వం అనుమతించింది. అయితే, పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఈ మొత్తాన్ని కూడా పెంచాలని ఆర్టీసి నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 చొప్పున పెంచాలని, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో చిల్లర సమస్య రాకుండా రూ.10ల వరకు రౌండప్ చేయాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ సర్య్కులర్ జారీ చేశారు.

డీజిల్, ఇతర అవసరాలకు రోజు రూ.16 కోట్లు

ఇటీవలే రౌండప్ పేరిట రూ.5ల వరకు చార్జీలను సవరించిన ఆర్టీసి తాజాగా ప్యాసింజర్ సెస్ పేరిట రూ.5ల నుంచి -10ల వరకు పెంచారు. ఇదిలా ఉండగా, మరో రెండు నెలల్లో సుమారు 4,250 బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టాలని ఆర్టీసి భావిస్తోంది. ఇది అమల్లోకి వచ్చాక ఇన్ఫర్మేషన్ సెస్ పేరిట ఒక్కో టిక్కెట్‌పై రూ.1-5 వరకు చార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్టీసి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చార్జీలు సవరించినప్పటికీ రోజువారీ ఆదాయం సరాసరిన రూ.10 నుంచి -రూ.12 కోట్లు దాటడం లేదని, డీజిల్, ఇతర అవసరాలకు రోజు రూ.16కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆర్టీసి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆర్డీనరీ బస్సు పాస్ ధర రూ.1,150లు

ఇప్పటికే బస్సు ఛార్జీల ధరలను పెంచిన ఆర్టీసి తాజాగా బస్‌పాస్‌ల ధరలను కూడా పెంచింది. ఆర్డీనరీ పాస్ ధర రూ.970ల నుంచి రూ.1150లకు పెంచింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధర రూ.1070ల నుంచి రూ.1300లకు, మెట్రో డీలక్స్ పాస్ ధర రూ.1185ల నుంచి రూ.1450లకు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పాస్ ధర రూ.1100ల నుంచి రూ.1350లకు పెంచింది. పుష్పక్ ఎసి పాస్ ధర రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసి అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News