హైదరాబాద్ : కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ఆలయాల దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. హకీంపేట, కుషాయిగూడ డిపోల నుంచి ప్రతి శని, ఆది, సోమవారం ఆలయాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్‌ఎం వెంకన్న తెలిపారు. నవంబర్ 2 నుంచి ఈ ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.350 చొప్పున టికెట్ ధరలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు www.tsrtconline.in ను, కుషాయిగూడ డిపో మేనేజర్ 9959226145, హకీంపేట్ డిపో మేనేజర్ 9959226144 సంప్రదించాలన్నారు.
జెబిఎస్ నుంచి ఉదయం 6 గంటలకు..!
జెబిఎస్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరనున్న ఆర్టీసీ బస్సు ఆలియాబాద్‌లోని రత్నాలయం, వర్గల్ సరస్వతి దేవాలయం, కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం, కీసరగుట్టలోని శివాలయం, చీర్యాల్లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శనం అనంతరం అదే రోజు సాయంత్రం తిరిగి జెబిఎస్‌కె చేరుకుంటుంది.
కుషాయిగూడ నుంచి ఉదయం 7:30 గంటలకు..!
కుషాయిగూడ డిపోకు చెందిన బస్సులు ఉదయం 7:30 గంటలకు కుషాయిగూడ నుంచి బయలుదేరి వర్గల్లోని సరస్వతి దేవాలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, కీసరగుట్టలోని శివాలయం దర్శించుకొని అదేరోజు సాయంత్రం తిరిగి కుషాయిగూడకు చేరుకుంటుందని తెలిపారు.