మే7 నుంచి సమ్మె చేయాలని జెఎసి నిర్ణయం ఎండి
సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు నోటీసులు అందజేత
జనవరి 22నే సమ్మె హెచ్చరికలు చేసిన జెఎసి అయినా
యాజమాన్యం బేఖాతరు
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్‌టిసి కార్మికుల సమ్మె సైరన్ మోగింది. మే 7 నుంచి సమ్మె చేయాలని ఆర్‌టిసి జెఎసి నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌కు, లేబర్ కమిషనర్‌కు ఆర్‌టిసి జెఎసి సమ్మె నోటీసులు ఇచ్చింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుండి విధులు బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఆర్‌టిసి జెఎసి జనవరి 27న యాజమాన్యానికి నమ్మె నోటీసు ఇచ్చింది. అయినా యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషనర్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోమవారం ‘ఛలో లేబర్ కమిషనర్ ఆఫీస్‘ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ కె. హన్మంత్ ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి, కన్వీసర్ ఎండి. మౌలానా, కో- కప్పివర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మే 7 నుండి సమ్మెకు వెళ్తున్నట్లు జెఎసి నాయకులు ప్రకటించారు.
సమ్మె నోటీసులో 21 అంశాలు ప్రస్తావించామని, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ, యాజమాన్యాలను ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసినా వారినుండి స్పందన రాకపోవడంతో సమ్మె అనివార్యమైందని అన్నారు. ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటివరకు ఆ సమస్య ఓ కొలిక్కి రాలేదన్నారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్దరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా నేటివరకు సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. 2017 వేతన సవరణ జరిగినా, నేటికీ ఎరియర్స్ రాకపోవటం విచారకరమని జెఎసి నేతలు పేర్కొన్నారు. రిటైరైన ఉద్యోగులకు 2017 వేతన సవరణ ఫిక్సేషన్లు జరవకపోవటం చాలా బాధాకరమని, ఆ ఫిక్సేషన్లు జరిపి వా రికి వెంటనే ఎరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2017 అలవెన్స్ లు అమలు జరపలేదని, పాత అలవెన్స్‌లనే నేటికి అమలు చేస్తూ కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోచుకుంటోందని విమర్శించారు.
20 21 వేతన సవరణ కాల పరిమితి అయిపోయినందున వెం టనే వేతన సవరణ జరిపి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ఇచ్చే ఉద్యోగాలు కన్సాలిడేటెట్ పే విధానంలో కాకుండా రెగ్యులర్ బేసిన్ లో ఇ వ్వాలని కోరారు. పనిభారాలు ఎక్కువవుతుండడం వల్ల డ్రైవర్లు విధి నిర్వహణలో స్టీరింగ్ పైనే అకాల మరణం పొందుతున్నారని వారు ఆవేదన చెందారు. కండక్టర్లు కూడా దీర్ఘకాలిక వ్యాధులకు గురై విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సోమవారం లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వస్తున్న కార్మికులను ప్రభుత్వం, యాజమాన్యాలు భయభ్రాంతులకు గురి చేశారని జెఎసి నేతలు ఆరోపించారు. నిరసన కార్యక్రమములో పాల్గొనకుండా అడ్డుకట్ట వేయడానికి ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూ డెం, చెంగిచెర్ల, పాకింపేట, కూకట్ పల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు అనేక చోట్ల అక్రమ అరెస్ట్ లను చేశారని. జెఎసి తీవ్రంగా ఖండిస్తోందన్నారు.