Thursday, January 23, 2025

గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు తీపికబురు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల టి-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. అంతేకాదు, కొత్తగా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికే టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధృవీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్ ను బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్ లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో టి-24 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది.

ఒక లీటర్ పెట్రోల్ ధర కంటే తక్కువకే 24 గంటల పాటు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎండాకాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం టి-24 టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, ఆ టికెట్ ను సీనియర్ సిటిజన్లకు రూ. 80కే అందించాలని నిర్ణయించిందని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. టి-24 టికెట్ కు మంచి స్పందన వస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.

మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించచవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్‌ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News