ఎపి, కర్ణాటక, మహారాష్ట్రలకు కార్గో సేవల విస్తరణ
త్వరలోనే డోర్ డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం
ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్గో రవాణా సేవలకు రెండేళ్లు పూర్తయ్యాయని, ఈ సందర్భంగా సేవలను మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నామని రాష్ట్ర ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో ఆర్టీసి కార్గో పార్సిల్ బుకింగ్‌ను సుమారు 79.02 లక్షలు వినియోగదారులు వినియోగించుకున్నారన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, కూరగాయలు, ధాన్యం, రేషన్ దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు అవసరమైన సరుకులను ఇంకా అనేక రకాల సర్వీసులను ఆర్టీసి కార్గో చేరవేస్తుందన్నారు. వస్తువులు రవాణా చేసే సౌకర్యంతో పాటు కొరియర్ సేవలను ఆర్టీసి అందచేస్తోందన్నారు. రెండేళ్లలో కార్గో ద్వారా ఆర్టీసికి ఆదాయం రూ.123.45 కోట్లు వచ్చిందన్నారు.
అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు టిఎస్ ఆర్‌టిసి కార్గో సర్వీసులను విస్తరిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిఎస్ ఆర్‌టిసి కార్గో పార్సిల్ సెంటర్లు 455 పనిచేస్తున్నాయని, ఔట్ సైడ్ బ్రాంచీలు 65 ఉండగా దీనికి అనుబంధంగా 177 కార్గో బస్సులు ఈ సేవలను అందిస్తున్నాయన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కార్‌లో డోర్ డెలివరీ సేవలు అందించబోతున్నామని, దీనికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. వినియోగదారుల కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేసే వెసులుబాటు సైతం కల్పిస్తామని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలియచేశారు.
TSRTC to extends Cargo Services to AP and Karnataka