రెగ్యులర్ చార్జీల పెంపు విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం
చార్జీల పెంపుపై ప్రజల్లో అసంతృప్తి లేదు
ఆర్టీసి ఎండి సజ్జనార్
హైదరాబాద్: డీజిల్ ధరల దృష్ట్యా బస్సు చార్జీలను పెంచాల్సి వస్తోందని, అందులో భాగంగానే డీజిల్ సెస్ చార్జీలను పెంచామని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. రెగ్యులర్ చార్జీల పెంపు విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. మంగళవారం విలేకరులతో ఎండి సజ్జనార్ మాట్లాడుతూ బస్సు చార్జీల పెంపుపై ప్రజల్లో అసంతృప్తి లేదని, చాలా మంది తనతో మాట్లాడారన్నారు. నాలుగు నెలలుగా డీజిల్ ధర బాగా పెరిగిందని, ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. ఇప్పటి వరకు సర్దుబాబు చేసుకుంటూ నెట్టుకొచ్చామని, మార్చి నెల నుంచి చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. ఆర్టీసి నష్టంలో ఉందని, కోవిడ్ నుంచి కోలుకుంటున్న తరుణంలో థర్డ్ వేవ్ వచ్చిందని, ఇప్పుడు డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో ఆర్టీసి సంస్థ ఇంకా నష్టంలో కూరుకుపోయే అవకాశం ఉందని, అందుకే డీజిల్ సెస్‌ను అమల్లోకి తీసుకొచ్చామని ఆయన వివరించారు. తమ ప్రతిపాదనను ప్రభుత్వం అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.