మనతెలంగాణ/హైదరాబాద్: మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపనున్నట్టు టిఎస్ ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతుండగా, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టిఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కొరకు ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపాలని నిర్ణయించింది. అయితే 3,845 బస్సులను నడపనున్న నేపథ్యంలో మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్టుగా తెలిసింది. అయితే ఈ మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ఇప్పటికే చేపట్టింది. కరోనా నేపథ్యంలో శానిటేషన్ వంటి ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
TSRTC to Run 3845 Buses to Medaram Jatara