Monday, December 23, 2024

రాఖీ పౌర్ణమికి 3 వేల ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండి విసి సజ్జనార్ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున నడుపనున్నట్లు ఆయన వివరించారు. రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై శనివారం సంస్థ ఎండి విసి సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఖీ పౌర్ణమికి హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, గోదావరిఖని, మంచిర్యాల, తదితర రూట్లలో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే జేబిఎస్, ఎంజీబిఎస్ బస్‌స్టేషన్‌లతో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రెగ్యులర్ బస్సులకు అదనంగా మరో 3 వేల ప్రత్యేక బస్సులు
గతేడాది ఆగస్టు 12న రాఖీ పండుగకు అధికారులు సమష్టిగా పనిచేశారని ఆయన తెలిపారు. ఫలితంగా ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.20 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక్క రోజులో ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. గతేడాది స్పూర్తితో ఈ రాఖీ పౌర్ణమి కూడా అలాగే పనిచేయాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. టిఎస్ ఆర్టీసి సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థపై బాధ్యత మరింతగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేసి సంస్థకు మంచి పేరును తీసుకురావాలని ఎండి సూచించారు. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ముడిపడి ఉన్న ఈ పండుగ రోజున మహిళలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని అందులో భాగంగానే టిఎస్ ఆర్టీసి అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. గత ఏడాది రద్దీ దృష్ట్యా ఈ సారి రెగ్యులర్ సర్వీసులకు తోడు 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

గత సంవత్సరం 12 డిపోల్లో 100 శాతం ఓఆర్
గత రాఖీ పౌర్ణమి రోజున అక్యూపెన్సీ రేషియో(ఓఆర్) 87 శాతంగా నమోదయ్యిందన్నారు. నల్లగొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ రీజియన్లు 90 శాతానికిపైగా ఓఆర్ సాధించాయన్నారు. 12 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదయ్యిందన్నారు. గత రికార్డుల నేపథ్యంలోనే ఈ సారి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతున్నామని ఆయన తెలిపారు. ఈ ఆర్టీసి బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. రాఖీ పౌర్ణమి ప్రత్యేక బస్సులకు సంబంధించిన మరింత సమాచారం కోసం సంస్థ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, కృష్ణకాంత్లతో పాటు హెచ్‌ఓడిలు, ఆర్‌ఎంలు, డిప్యూటీ ఆర్‌ఎంలు, డిఎంలు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News