హైదరాబాద్ : తెలంగాణలో పర్యాటకాభివృద్ది సంస్థ సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. పర్యాటక ప్రాంతాల్లో బడ్జెట్ హోటళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను అమితంగా ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. గోవా, ఊటీ, కోడైకెనాల్ వంటి ప్రాంతాల్లో అక్కడి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బడ్జెట్ హోటళ్లను తెలంగాణలోనూ ఏర్పాటు చేయిస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణా జిల్లాలన్నింటిలోనూ త్వరలో ప్రభుత్వ బడ్జెట్ హోటళ్లు రానున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో హరిత చైన్ ఆఫ్ హోటళ్లు , రిసార్ట్‌లను ఏర్పాటు చేయగా పర్యాటకుల నుండి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలో ‘రిజర్వాయర్ల వద్ద బోటింగ్ సౌకర్యాలను ప్రవేశపెట్టడానికి , జల క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ హోటళ్లను అభివృద్ధి చేయాలని, సరస్సుల వద్ద బోటింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటకులకు తక్కువ రేట్లకే మెరుగైన వసతి కల్పించడానికి ప్రతిపాదిత బడ్జెట్ హోటళ్ల కోసం భూమిని కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే క్రమంలో పర్యాటక రంగం బడ్జెట్ హోటళ్ల రూపంలో ఈ రకమైన వినూత్న చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ లోని అన్ని జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయిస్తోంది. పర్యాటక పరంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తు 2023లో ఈ సారి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా బడ్జెట్ హోటళ్ల ఏర్పాటుచేయాలని భావిస్తోంది. పర్యాటక ప్రాంతాల్లోని అందాలను వీక్షిస్తూనే పర్యాటకులు మంచి హోటళ్లలో బస చేస్తూ సరికొత్త ఆతిథ్యాలను స్వీకరిస్తుంటారు. ఈ క్రమంలో అలాంటి బడ్జెట్ హోటళ్లనూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ ( టిఎస్ టిడిసి ) ద్వారా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది.
గత ఏడాది లో పనులు ప్రారంభించిన పర్యాటక అభివృద్ధి శాఖ ఈ ఏడాది 2023లో వీటిని పూర్తి చేసి పర్యాటకులకు సకల సౌకర్యాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ హోటళ్లు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ 26వ బోర్డు సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కుటుంబ సమేతంగా పర్యాటకులు దేశ విదేశాల నుండి కూడా తెలంగాణకు ఏటా పెద్ద ఎత్తున వస్తున్నారని.. అమెరికా తదితర విదేశీ టూరిస్టులకు సకలు సౌకర్యాలు వీటిలో కల్పించేలా ఈ బడ్జెట్ హోటళ్ల నిర్మాణాలు చేయాలని టిఎస్ టిడిసి భావిస్తోంది. ఒక్కో బడ్జెట్ హోటళ్ల నిర్మాణాలు కూడా కాటేజ్‌లు, హట్‌ల తరహాలోనూ పలు చోట్ల ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. కాగా తెలంగాణలో అన్ని జిల్లాలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుండడంతో టూరిజం పరంగాను అన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా పర్యాటకాభివృద్ధి సంస్థ టిఎస్ టిడిసి చర్యలు తీసుకుంటోంది.