Monday, January 20, 2025

నేడు టెట్

- Advertisement -
- Advertisement -

TSTET Exam 2022 today

నేడు టెట్
ఉ. 9.30 నుంచి 12 వరకు పేపర్ -1,
మ. 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్- 2
ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ అభ్యర్థులకు ఆదివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిఎస్ టెట్) పరీక్ష జరుగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి టెట్ నిర్వహిస్తున్నారు. టెట్ పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లబాటయ్యేలా మార్పులు చేయడంతో బి.ఇడి, డి.ఎడ్ అభ్యర్థులు పెద్దఎత్తున టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పేపర్ 1కు 1,480 కేంద్రాలు, పేపర్ 2కు 1,203 కేంద్రాలు, మొత్తం 2,683 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష జరగనుంది. టెట్ పరీక్ష కోసం 1,480 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లను, 1,480 డిపార్ట్‌మెంటల్ అధికారులను, 29,513 ఇన్విలేజర్లను, 252 ఫ్లైయింగ్ స్వార్డులు, రూట్ ఆఫీసర్లను నియమించారు.
ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ..
టెట్ పరీక్షకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షకు అనుమతించమని స్పష్టం చేశారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, కనీసంగా గంట ముందే చేరుకోవాలని సూచించారు.
స్కోర్ కోసం మళ్లీ టెట్‌కు రాయనున్న అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్ పరీక్ష నిర్వహించారు. ఐదు సంవత్సరాల తర్వాత టెట్ నోటిఫికేషన్ వెలువడటం, బి.ఇడి అభ్యర్థులకు పేపర్ 1 రాసేందుకు అవకాశం కల్పించడంతో ఈసారి కొత్త, పాత అభ్యర్థులు టెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు. ఈసారి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో గతంలో టెట్ ఉత్తీర్ణులైన బి.ఇడి, డి.ఇడి అభ్యర్థుల్లో అధిక శాతం తమ స్కోర్‌ను పెంచుకునేందుకు మరోసారి టెట్ రాస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 60 శాతం, బిసి అభ్యర్థులు 50 శాతం, ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగుల కేటగిరీకి చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులను సాధించాలి.

అభ్యర్థులకు సూచనలు
టెట్ పరీక్ష పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు.
పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు హాలులోకి అనుమతించరు.
బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే ఓఎంఆర్ షీట్‌ను నింపాలి.
అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు తెచ్చుకోవాలి
పరీక్ష సమయం ముగిసిన తర్వాతే అభ్యర్థి పరీక్షా హాలు నుంచి బయటకు పంపిస్తారు.
ఓఎంఆర్ షీట్‌ను మడత పెట్టడం, ముడతలు పడేలా చేయడం, బార్ కోడ్‌ను ట్యాంపర్ చేయడం వంటివి చేయకూడదు.
హాల్‌టికెట్లపై అభ్యర్థి, అధికారుల సంతకం, అభ్యర్థి ఫొటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమ క్షంలో ఫొటో అంటించి, ధ్రువీకరణ     తీసుకుని, డిఇఒ ద్వారా అనుమతి పొందాలి.

TSTET Exam 2022 today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News