మన తెలంగాణ, హైదరాబాద్ : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్ధానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఈనెల 28న భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లను చేసినట్లు జెఇవో వీరబ్రహ్మం వెల్లడించారు. బ్రహ్మాత్సవాల్లో తొలిసారిగా వేలాది మంది భక్తులు సేద తీరేలా ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్లను నిర్మించామన్నారు.
ఆదివారం రాత్రి నుంచి అన్నప్రసాదాలు, తాగునీరు, తేనీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే పద్మపుష్కరణి లోనికి ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, క్యూలైన్లు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు టిటిడి భద్రతా సిబ్బంది, స్కాట్స్ అండ్ గైడ్స్, ఎన్‌సిసి విద్యార్థులు, 2500 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు.
భక్తులకు అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు అందించే విధంగా 120 కౌంటర్లతో పాటు అదనంగా పార్కింగ్ ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేశామని, అలాగే ఒక లక్షా 75 వేల వాటర్ బోటిల్స్‌ను అందజేస్తామన్నారు. ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి రావచ్చని అంచనా వేశామన్నారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా తాత్కాలిక, మొబైల్ అన్ని కలిపి 500 మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, 700 మంది పారిశుద్ధ సిబ్బందిని నియమించామన్నారు.
భక్తులకు వైద్య సేవలందించేందుకు మూడు ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామన్నారు. స్విమ్స్, రూయా, టిటిడి ఆయుర్వేద ఆసుపత్రులకు చెందిన వైద్య సిబ్బంది సేవల్లో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అలాగే ఫైర్, జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. పంచమి తీర్ధంలో భక్తులకు సేవలందించేందుకు వెయ్యిమంది శ్రీవారి సేవలకులు ఆదివారం సాయంత్రం నుంచే వివిద ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.