14 టన్నుల బంగారం,
14వేల కోట్ల డిపాజిట్లు
ప్రతి ఏటా టిటిడి
ఆస్తులపై శ్వేతపత్రం
బ్రహ్మోత్సవాల తరువాత
సర్వదర్శనం టోకెన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి చెందిన 7,123 ఎకరాల్లోని 960 ఆస్తుల తుది జాబితాను టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన అధ్యక్షతన టిటిడి పాలక మండలి సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఇలా ప్రతియేటా టిటిడి ఆస్తులపై శ్వేత పత్రం సమర్పిస్తామని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 960 స్థిర ఆస్తులు ఉండగా, వాటి విలువ రూ.85,705 కోట్లు కాగా… స్వామివారి పేరుతో 7123 ఎకరాల భూమి ఉన్నదని, టిటిడికి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో… రూ.14,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 14 టన్నుల బంగారం ఉందని ప్రకటించారు.
1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్ బోర్డులు స్వామివారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు వెల్లడించారు. 2014 తరువాత ఇప్పటి వరకు తాము ఎలాంటి ఆస్తులు విక్రయించలేదని, టిటిడికి ఉన్న ఆస్తులు, వాటి విలువలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామని చైర్మన్ వెల్లడించారు. కరోనా కారణంగా మాడ వీధుల్లో నిర్వహించలేకపోయిన బ్రహ్మోత్సవ వాహన సేవలను రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని.. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టిటిడి ఈఓ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.