Thursday, January 23, 2025

27న టిటిడి బ్రేక్ దర్శనాలు రద్దు..

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం కారణంగా ఈనెల 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. ఈ కారణంగా 26వ తేదీన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని వారు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి అధికారులు కోరారు. 27వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని తెలిపారు.

32 నిమిషాల్లోనే బుక్కైన వైకుంఠ ద్వార దర్శన ఆన్‌లైన్ టికెట్లు
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన 32 నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయినట్లు టిటిడి ప్రకటించింది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు తిరుమల ఆలయం వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక దర్శనానికి సంబంధించి టిటిడి శనివారం ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయగా, 32 నిమిషాల్లోనే టికెట్లు అన్ని బుక్కు అయిపోయాయి. మరోవైపు సర్వ దర్శనం కోసం జనవరి1వ తేదిన ఆఫ్‌లైన్ విధానంలో 9 కేంద్రాలల్లో రోజుకి 50 వేల చొప్పున 5 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి వెల్లడించింది.

జనవరి 1 నుంచి తెప్పోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. పుష్కరిణిలో ఐదు రోజుల పాటు జరిగే ఈ తెప్పోత్సవాలను ప్రతిరోజూ సాయింత్రం 6 నుంచి 7.30 గంటల వరకు నిర్వహిస్తారు. మొదటిరోజు జనవరి 1వ తేదీన వినాయక స్వామి, చంద్రశేఖర స్వామి పుష్కరిణిలో ఐదు చుట్లు, రెండవ రోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఐదు చుట్లు, మూడవ రోజు శ్రీ సోమస్కంద స్వామి ఐదు చుట్లు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మ ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీచండికేశ్వరస్వామి, చంద్రశేఖర స్వామి తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News