తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను టిటిడి ఇఒ జె శ్యామలరావు, అదనపు ఇఒ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడసేవకు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇందులో భాగంగా, జిల్లా పోలీసులతో పాటు టిటిడి ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి, వివిధ గ్యాలరీల్లోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం, తదితర భద్రతా అంశాలు పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి, వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో టిటిడి ఇఒ జె శ్యామలరావు మాట్లాడుతూ…. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టిటిడి నిఘా, భద్రత విభాగము, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సిఇ నాగేశ్వరరావు, ఎస్ఇ సత్యనారాయణ, డిప్యూటీ ఇఒ హెల్త్ ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూధన్ ప్రసాద్, విజిఓలు సురేంద్ర, రామ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.