తిరుమల: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జ్ఞానప్రసూనాంబ, శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టిటిడి తరఫున ఇఒ ఎవి ధర్మారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఇఒకు శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఇఒ నాగేశ్వరరావు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ధర్మారెడ్డికి తలపాగా చుట్టి పట్టువస్త్రాలు తలమీద ఉంచారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న ఇఒ, ఇతర ముఖ్యులతో కలసి సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసూనాంబకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.