Monday, December 23, 2024

తిరుమలలో చిరుతల సంచారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో టిటిడి భక్తుల భద్రతపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆలయ పరిధిలో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారంపై అటవీ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రాత్రి పూట జంతువులు ఆలయ పరిధిలోకి రాకుండా టపాసులు కాల్చాలని నిర్ణయించినట్లు శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న తెలిపారు. త్వరలో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫెన్సింగ్ నిమిత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహకారంతో రూ.5 కోట్ల 30 లక్షలకు టెండర్ పిలుస్తామన్నారు.

వచ్చే రెండేళ్లలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకు రక్షణ కల్పిస్తామని లవన్న వెల్లడించారు. కాగా అలిపిరి కాలినడక మార్గం శుక్రవారం రాత్రి ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అటవీ, పోలీసు శాఖలతో కలిసి కాలినడక మార్గంలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు అటవీ శాఖ ఇప్పటికే 24X7 ప్రాతిపదికన రెండు బోనులను సిద్ధంగా ఉంచినట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి ఎవి ధర్మారెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఈ మార్గంలో గాలి గోపురం పాయింట్ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు దాదాపు 500 సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు తిరుమలకు కాలినడక మార్గంలో పిల్లలతో కలిసి వెళ్తున్న తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక, అటవీశాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత టిటిడి మరిన్ని చర్యలు తీసుకోనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News