Friday, November 22, 2024

నడకదారిలో పిల్లలకు అనుమతిపై టిటిడి ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

చేతికి పోలీస్ సిబ్బంది ట్యాగులు

చిన్నారిపై చిరుత దాడి నేపథ్యంలో నిర్ణయం

మళ్లీ కనిపించిన చిరుత

మనతెలంగాణ/ హైదరాబాద్ : అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం కాలిబాటలో వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను అలిపిరి కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసు టోల్ ఫ్రీ నంబర్ పొందుపరుస్తున్నారు.
వన్యప్రాణులు రాకుండా లైటింగ్, సౌండ్ సిస్టమ్‌లు!
నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెనికి చెందిన బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడంతో టిటిడి ఈ మేరకు రక్షణ చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన చిరుతను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకొనేలా చైతన్యపరుస్తోంది. క్రూర మృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు భక్తులు సహకారం అందించాలని అధికారులు కోరారు. నడకదారి మార్గంలో అడవి మృగాలు సంచరించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వన్యమృగాలు నడకదారి దగ్గరకు రాకుండా ఉండేందుకు అవసరమైన సెంట్రీ పోస్టులు, సిసి కెమెరాలు, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. జంతువులు వస్తే దూరంగా తరిమేందుకు అవసరమైన లైటింగ్ సిస్టం, సౌండింగ్ సిస్టమ్‌లను సిద్ధం చేస్తున్నారు..
మరోసారి చిరుత కలకలం..
తిరుమల నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పారు. ఆదివారం 2450 మెట్టు వద్ద చిరుత కనిపించందంటూ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుతను చూసిన భక్తులు భయాందోళనకు గురై.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుతను అడవిలోకి పంపించేదుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తులను నడకమార్గంలో భద్రత నడుమ గుంపులుగా పంపిస్తున్నారు. ప్రస్తుతానికి 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగానే భక్తులను అనుమతిస్తున్నారు. ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను చూస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News