Saturday, December 21, 2024

చంద్ర బాబు జైలులో ఉండటం వల్లే ఎన్నికల్లో పోటీ చేయట్లేదు

- Advertisement -
- Advertisement -

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం
టి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించిన క్రమంలోనే తాము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఒక సారి పోటీ చేయనంత మాత్రాన మాది పార్టీనే కాదన్నట్లు కొన్ని పార్టీలు విమర్శించడంలో అర్థం లేదన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పార్టీనే లేదని కొందరు, భవిష్యత్తులోనూ ఉండదని మరి కొందరు ఇప్పటికే కనుమరుగైపోయింది ఇక పోటీ చేయదని ఇంకొందరు విమర్శలు చేస్తున్నారని అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఓ ప్రాంతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో టిడిపి కీలక పాత్ర వహించి,  పార్లమెంట్‌లో ప్రతిపక్ష పాత్రను కూడా పోషించడం ద్వారా ఢిల్లీ పీఠాన్ని కదిలించిన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పార్టీ అంటూ ఉందని అంటే అది తెలుగుదేశం పార్టీనే అని ఆయన అన్నారు. ఈ మేరకు గురువారం ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో ఐ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు టి.హరికృష్ణ, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏవి రావు తదతరులతో కలిసి అరవింద్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే సామాజిక న్యాయం వచ్చిందన్నారు. బడుగు, బలహీన వర్గాల గౌరవాన్ని సమాజంలో పెంచిన ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీయేనన్నారు. జిహెచ్‌ఎంసిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు చేసిన అభివృద్ధి, ఏ రాజకీయ పార్టీ కూడా కాదనలేనిదన్నారు. చంద్రబాబు నిర్మించిన సైబరాబాద్‌కు వెళితే ఫారిన్‌లో ఉన్నట్లు భావన కలుగుతుందన్నారు. దీనిని నిర్మించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఐటి ఉద్యోగులు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ సభకు లక్ష మంది వచ్చారన్నారు. యువతకు చంద్రబాబు ఏ విధంగా ఉద్యోగాలు కల్పించారన్నదానికి ఈ ఘటన నిదర్శనమని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు.

టిడిపి అధినేత చంద్రబాబుపై తాజాగా కేసు నమోదు చేయడంపైనా ఆయన స్పందించారు. అక్రమ కేసులు పెట్టి జైలులో నిర్భంధిస్తే 52 రోజుల తర్వాత బయటికి వచ్చిన బాబును చూసేందుకు జనం వేల సంఖ్యలో వచ్చారని , ఇలా స్వచ్చందంగా వేల సంఖ్యలో రావడం కూడా నేరమేనా? అని అరవింద్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు మాట్లాడుతూ టిడిపి లేదని విమర్శించడం అంటే తమ పార్టీ గిట్టని వారు, భయపడే వారి సృష్టినే అన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తెలుగుదేశం పార్టీకి కమిట్‌మెంట్ ఎప్పుడూ ఉందన్నారు. చంద్రబాబును చూసేందుకు ప్రజలు వస్తే దానిపైనా న్యూసెన్స్‌కేసు బుక్ చేస్తారా? అని ఎఎస్ రావు ప్రశ్నించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి అనూప్ కుమార్ బుడిగ, ప్రధాన కార్యదర్శి షేక్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News