Sunday, November 3, 2024

7 గంటల్లో 101 మంది మహిళలకు కు.ని. ఆపరేషన్లు

- Advertisement -
- Advertisement -

Tubectomy operations for 101 women in seven hours

దర్యాప్తునకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదేశం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ లోని సర్గుజా జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఓ వైద్యుడు అత్యుత్సాహం ప్రదర్శించి కేవలం ఏడు గంటల్లోనే 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. ఇది అత్యంత వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దర్యాప్తు కోసం ఆదేశించింది. ఈమేరకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. సర్గుజా జిల్లా మెయిన్‌పట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో గల నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆగస్టు 27న మెగా స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారు. అయితే ఈ శిబిరంలో నిబంధనల ప్రకారం రోజుకు 30 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాల్సి ఉండగా ఆరోజు ఆగస్టు 27 న మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏడు గంటల్లో 101 మంది మహిళలకు ట్యుబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించారు.

దీనిపై స్థానిక మీడియాలో విమర్శలు వచ్చాయి. దీంతో సర్గుజా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పిఎస్ సిసోడియా ఆగస్టు 29 న స్పందించారు. ఆపరేషన్లు చేసిన సర్జికల్ స్పెషలిస్టు డాక్టర్ జిబ్నస్ ఎక్కా, బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌ఎస్ సింగ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కమిటీ దర్యాప్తు నివేదిక ఇచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ అశోక్ శుక్లా వెల్లడించారు. ఆరోజు శిబిరానికి మారుమూల గ్రామాల నుంచి అనేక మంది మహిళలు వచ్చారని, ప్రయాణ దూరం కారణంగా తాము మళ్లీ రాలేమని అప్పుడే ఆపరేషన్ చేయాలని వారు అభ్యర్థించడంతో తాను ఆపరేషన్లు చేశానని సంబంధిత డాక్టర్ వివరించారు. ప్రస్తుతం ఆ మహిళలంతా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News