సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ఆవిష్కరణ
న్యూఢిల్లీ : ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలు, సఫాయి కర్మచారీలు, దివ్యాంగులు, మైనారిటీ వర్గాలు సహా అట్టడుగు వర్గాలకు చెందిన చేతివృత్తి నిపుణులకు మార్కెట్ వసతిని పెంచేందుకు కేటాయించిన డిజిటల్ వేదిక ‘తులిప్’ను కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ మంగళవారం ప్రారంభించారు. జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక, అభివృద్ధి సంస్థ (ఎన్‌బిసిఎఫ్‌డిసి), సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మార్గదర్శకత్వం కింద ప్రారంభించిన ‘తులిప్’ లక్షం దేశంలోని నిపుణులైన చేతివృత్తి కళాకారులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం గావించడం.
దిల్లీ హాట్‌లో నిర్వహించిన శిల్ప్ సమాగమ్ మేలాలో తులిప్ ప్రారంభం సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతీయ సాంప్రదాయక హస్త కళాకారుల్లో ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ‘ఎస్‌సిలు, సఫాయి కర్మచారీలు సహా అట్టడుగు వర్గాల వారిని ప్రధాన స్రవంతంలోకి తీసుకురావడం మా లక్షం. వారి సాధికారత, స్వావలంబన (ఆత్మనిర్భర్) కోసం మేము కృషి చేస్తున్నాం’య అని ఆయన తెలిపారు.
వారి పురోగతిని వేగిరపరిచేందుకు ఇటువంటి వేదిక కల్పించడానికి మంత్రిత్వశాఖ కృషి చేస్తోందని వీరేంద్ర కుమార్ తెలియజేశారు. 16 రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా చేతివృత్తి నిపుణులు, వ్యవస్థాపకులు శిల్ప్ సమాగమ్ మేలాలో పాల్గొంటూ సాంప్రదాయక ఉత్పత్తులు, నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారు. మంగళవారం మొదలైన ఈ మేలా ఈ నెల 15 వరకు కొనసాగుతుంది.