ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
ముఖ్య అనుచరులతో రహస్య సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా పాలేరు టికెట్ ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన హస్తంలో పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన తన అనుచరులతో కలిసి మంగళవారం పాలేరులో రహస్యంగా సమావేశమయినట్టుగా తెలిసింది. ఈ రహస్య సమావేశంలో భాగంగా కాంగ్రెస్‌లో చేరితే ఎలా ఉంటుందన్న అంశానికి సంబంధించి తన అనుచరులతో తుమ్మల చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులతోనూ తుమ్మల మాట్లాడినట్టుగా తెలిసింది.
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తుమ్మలకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సారి గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన తుమ్మల కొద్ది రోజుల క్రితమే తన పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు బిఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్‌పై తుమ్మల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.