Wednesday, January 22, 2025

అర్హులందరికీ అందేదాకా రుణమాఫీ: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రుణమాఫీ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కొందరు రైతులను గందరగోళంలో పడేసే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏనాడూ రైతుల గురించి మాట్లాడనివారు ఇప్పుడు రైతు జపం చేస్తున్నారని, వారి మాటల నమ్మి మోసపోవద్దన్నారు. గడిచిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల లెక్కలు తీయగా 40 బ్యాంకులకు సంబంధించి 5782 బ్రాంచ్ లలో 41,78,892 ఖాతాల్లో రూ.31 వేల కోట్ల రుణాలను తీసుకున్నట్లు అధికారులు తమకు లెక్కలు చెప్పారని అన్నారు.

దానికి అనుగుణంగా ఈ నెల 15లోగా రూ.18 వేల కోట్ల నిధులను ఆయా బ్యాంకులకు విడుదల చేశామన్నారు. మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.26 లక్షల ఖాతాలకు సంబంధించి రూ.24 వేల కోట్ల రుణాలను జమ చేశామని అన్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్నవారందరికీ రుణ మాఫీ జరిగిందన్నారు. సాంకేతిక కారణాలు, ఆధార్ కార్డులో తప్పులు, బ్యాంక్ అకౌంట్లో తప్పులు, పట్టాభూముల లెక్కల్లో తప్పులు, రేషన్ కార్డులు లేకపోవడం వల్ల కుటుంబసభ్యులను గుర్తించడం ఆలస్యం కావడం తదితర కారణాలతో కొంతమందికి రుణమాఫీ జరగలేదని అన్నారు. అయితే, సాంకేతిక సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, అర్హులదరినీ రుణమాఫీ జరగడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

గడిచిన పదేళ్ల కాలంలో రేషన్ కార్డుల పంపిణీ చేయకపోవడం వల్ల ఇప్పుడు కుటుంబసభ్యులను నిర్ధారణ చేయడం కష్టంగా మారినందున ఈనెల 16 నుంచి వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబసభ్యులను (ఫ్యామిలీ మ్యాఫింగ్) గుర్తించడం ప్రారంభించారని తెలిపారు. రైతు వేదికలకు ఒక్కో అధికారిని, బ్యాంక్‌ల బ్రాంచ్‌ల వారీగా ఒక అధికారిని,మండలానికి ఒక అధికారిచొప్పున నియమించామని, ఎవరికి రుణమాఫీ జరగలేదో వారంతా సంబంధిత మండల వ్యవసాయ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని హితవు పలికారు. ఆయా దరఖాస్తులను పరిశీలించి అన్ని నిబంధనల ప్రకారం అర్హతలుంటే రుణమాఫీ చేసి వెంటనే వారి అకౌంట్లో కొత్త రుణాలను అందిస్తారని స్పష్టం చేశారు. రుణమాఫీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌లో ఆధార్ నెంబర్ ఫీడ్ చేయగానే సంబంధిత రైతు వివరాలను వెంటనే తెలియజేస్తూ రుణ మాఫీ ఎందుకు కాలేదో దానికి కారణం ఏమిటో తెలియజేస్తుందని, దాని ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు.

గత ప్రభుత్వంలో లక్షలోపు రుణ మాఫీ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఉంటే, ఎన్నికల నోటిఫికేషన్ జారీకి వారం రోజుల ముందు హడావుడిగా తూతుమంత్రంగా కేవలం 40 లక్షల మందికే రుణమాఫీ చేశారని, వాళ్ళు ఇప్పుడు శ్రీరంగనీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి లక్ష రుణమాఫీ అని సగం కూడా మాఫీ చేయకుండా కేవలం 16 లక్షల ఖాతాలో 11 వేల కోట్ల్లు జమ చేసి, ఇప్పుడు ఉత్తర ప్రగల్బాలు పలుకుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. భవిష్యత్తులో లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఒఆర్‌ఆర్‌ను తెగనమ్మి వచ్చిన 11 వేల కోట్లతో అరకొరగా రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. కేవలం అధికారంలోకి వచ్చిన 8 నెలల వ్యవధిలోనే తాము రెండు లక్షల రుణమాఫీ చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక నిర్లజ్జగా, నిస్సిగ్గుగా రైతులను ప్రేరేపించి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుదారి పట్టించే నీచ సంస్కృని మానుకోవాలని విపక్షాలకు సూచించారు.

రుణమాఫీ కోసం తాము కొత్తగా మార్గదర్శకాలను జారీ చేయలేదని, గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాత పద్ధతిలోనే చేశామని, కొత్తగా ఎలాంటి కొత్త అంక్షలను పెట్టలేదన్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ అయిన తరువాత శ్వేతపత్రమే కాదు.. పూర్తి వివరాలను అందజేస్తామన్నారు. రైతుల గురించి ఆలోచనలు చేయనివారు గత మూడు నెలల నుంచి రైతు జపం చేస్తున్నారని, ప్రధానంగా బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ మొదటిసారిగా రైతుల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైతులను రెచ్చగొట్టి ఆందోళనకు ఉసిగొల్పే దురాలోచన మంచిది కాదన్నారు.

మొదటి పంట సమయంలోనే ఆరాట పడవద్దని ఇప్పట్లో ఎన్నికలు కూడా ఏమీ లేవని వ్యంగ్యంగా విమర్శించారు.రుణమాఫీలో రెండు లక్షలకు పైగా రుణం ఉన్న వారి విషయంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి తు మ్మల తెలిపారు. సన్న, చిన్నకారు రైతులకు సంబంధించి 42 లక్షల ఖాతాల వరకు రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యే వరకు ఈ పక్రియ కొనసాగుతుందని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో విధివిధానాలను ఖరారు చేసి దానికి ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News