తుమ్మల రాకతో ఖమ్మం జిల్లాకు అదనపు ప్రయోజనం చేకూరేనా?
తుమ్మల రాకపై పెద్దగా లాభం లేదంటున్న సీనియర్‌లు
ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆసక్తి
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం రావడంతో ఈనెల 06వ తేదీన తుమ్మల హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమయ్యింది. ఢిల్లీ వేదికగా తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మలకు అనుచరగణం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. కమ్మ సామాజికవర్గంలో ఆయనకు పట్టు ఉండటం కూడా పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తుమ్మలకు బిఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను బుజ్జగించేందుకు గులాబీ చేసిన ప్రయత్నాలను సైతం తుమ్మల నిరాకరించడంతో పాటు కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు.
తుమ్మల అభిమానులు సైతం కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరడంతో తుమ్మల కూడా కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసి గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో రానున్న రోజుల్లో వీరిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందని తేలనుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్కతో పాటు రేణుకాచౌదరి లాంటి నాయకులు ఉన్నారు. అయితే తుమ్మల పార్టీలో చేరడం వల్ల ఆ జిల్లాకు అదనంగా ప్రయోజనం చేకూరుతుందా లేదా ఘర్షణ వాతావరణం నెలకొంటుందా అన్న విషయమై కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే తుమ్మల పార్టీలో చేరడం వల్ల పెద్దగా లాభం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అధిష్టానంతో పాటు టిపిసిసి నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం.
రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం
తుమ్మల, రేవంత్ రెడ్డి గతంలో టిడిపి పార్టీలో కలిసి పనిచేశారు. ఇద్దరూ అప్పట్లో టిడిపిలో కీలక నేతలుగా ఉన్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. ఆ స్నేహపూర్వక సంబంధాల క్రమంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు తుమ్మల కూడా ఆసక్తి చూపుతున్నారు. బిఆర్‌ఎస్ పార్టీలో టికెట్ దక్కకపోవడంతో తుమ్మల అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరాలని తుమ్మలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీలో వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరితే ప్రాధాన్యత ఉంటుందని తుమ్మల భావిస్తున్నారు.