న్యూఢిల్లీ : లక్షద్వీప్ ఎన్‌సిపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సమీప బంధువు అబ్దుల్ రజాక్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కేసును నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం జరిగినట్టు సీబీఐ అధికారుల ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన విజిలెన్స్ డిపార్టుమెంట్, సిబిఐ కలిసి నిర్వహించిన సోదాల్లో నేరారోపణ చేయదగిన పత్రాలు దొరికినట్టు సమాచారం. కొలంబో లోని ఎన్‌ఆర్‌టీ జనరల్‌మర్చంట్స్ అనే కంపెనీకి అబ్దుల్ రజాక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక మత్సకారుల వద్ద ఎల్‌సీఎంఎఫ్ కొనుగోలు చేసిన ట్యూనా చేపలను అంతర్జాతీయ సగటు ధర కిలో గ్రాముకు రూ. 400 చొప్పున ఈ కంపెనీకి అమ్ముతున్నారు. ఈ కొనుగోళ్లు ,అమ్మకాలు, ఎగుమతుల కోసం ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మక్కయ్యారు. ఇందులో ఎంపీ పాత్రపై కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సోదాల్లో సేకరించిన రికార్డులను పరిశీలించిన తరువాత నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి ఆరోపణలతో ప్రథమ సమాచార నివేదిక ను దాఖలు చేసే అవకాశం ఉంది.