Wednesday, November 13, 2024

తుని రైలు దగ్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తుని రైలు దగ్దం కేసును సోమవారం విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తీర్పు సమయంలో ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ ముగ్గురు సహా 41 మంది నిందితులుగా ఉన్నారు. వీరికి క్లీన్ చిట్ వచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు ఆర్‌ఆర్‌ఎఫ్ పోలీసులు దర్యాప్తు సరిగా చేయలేదని పేర్కొంది. 2016 జనవరి 30వ తేదీన కాపు నాడు సభ సమయంలో రైలు దగ్ధమైంది. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత ఈ కేసులో సరైన సాక్ష్యాలు చూపించలేదంటూ కోర్టు కొట్టి వేసింది. కోర్టు తీర్పుపై కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. తుని రైలు దగ్ధం కేసులో ముగ్గురు రైల్వే పోలీసు అధికారులు దర్యాప్తును సరిగ్గా చేయలేదని వ్యాఖ్యానించింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాన్ని అయిదేళ్ల పాటు ఎందుకు సాగదీశారని కూడా ప్రశ్నించింది.

అయిదేళ్ళ పాటు కోర్టులో ఎక్కువ మంది సాక్షులను ప్రవేశ పెట్టలేదని తెలిపింది. ఆ రైలులో అంతమంది ప్రయాణిస్తుంటే ఎక్కువ మందిని విచారించలేదని అభిప్రాయపడింది. అయితే కోర్టుకు హాజరైన సాక్షి కూడా తాను ఆ రైలులో ప్రయాణించలేదని కోర్టులో సాక్ష్యం చెప్పారు. కాగా 2016 నాటి ఈ కేసులో నిందితుల జాబితాలో ఏ1గా ముద్రగడ పద్మనాభం, ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా ప్రస్తుతం మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా సహా మొత్తం 41 మందిపై రైల్వే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే 24 మంది సాక్షుల్లో 20 మంది కోర్టుకు హాజరు కాగా వారిలో ఐదుగురు సాక్షులు తమకు తెలియదని వాదించారు. ఇక 2016 జనవరిలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కోసం కాపుల ఆందోళనలో భాగంగా రైలు రోకోకు పిలుపు నిచ్చారు.

Also Read: బిజెపి కర్నాటక ఎన్నికల మేనిఫెస్టో అంతా బోగస్: సిద్దరామయ్య

ఈ సందర్భంగా కొందరు ఆందోళనకారులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పుపెట్టి తగులబెట్టారు. కాపుల బహిరంగ సభ సందర్భంగా జరిగిన అల్లర్ల నేపథ్యంలో జరిగిన విధ్వంసానికి అప్పటి టిడిపి రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు 329 కేసులు పలు సెక్షన్లు కింద నమోదు చేశారు. ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 2016 నుంచి 2019 వరకు జరిగిన దర్యాప్తులో 153 కేసులు వరకు వీగిపోయాయి. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టాక 176 కేసులకు 161 కేసులను వెనక్కు తీసుకుంది. 14 కేసులు మాత్రం కోర్టులో విచారణ కొనసాగుతోంది. వైసిపి ప్రభుత్వం 161 కేసులు వరకు ఎత్తివేసినా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రైల్వే శాఖకు సంబందించిన కేసులు పలు సెక్షన్లు కింద రైల్వే పోలీసులు కేసులు నమోదు చేయగా ఈ కేసులు విచారణ చేశారు.
ఊపిరి పీల్చుకున్న కీలక నేతలు
ఈ కేసులో ప్రదానంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్ టీవీ ఎండీ మంచాల సాయి సుధాకర నాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ వంటి వారు ఉన్నారు. వారందరూ కేసు నుంచి బయట పడినట్లయింది.
అయితే ప్రయాణికుల భద్రతతో ముడిపడిన వ్యవహారం విషయంలో నిందితులు ఎవరో తేల్చకపోవడం. అందర్నీ నిర్దోషులుగా విడుదల చేయడంతో మరి అసలు రైలుని ఎవరు తగలబెట్టారన్న ప్రశ్న వినవస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News