Monday, December 23, 2024

పెను భూప్రళయం

- Advertisement -
- Advertisement -

మనిషి తనను ఇంకా జయించలేదనే కఠోర సత్యాన్ని ప్రకృతి అప్పుడప్పుడూ అత్యంత నిర్దయగా, బిగ్గరగా చాటుతుంది. దాని వల్ల కారే కన్నీళ్ళు అనేక సముద్రాల కిమ్మత్తు అంటే అబద్ధం కాబోదు. టర్కీ, సిరియాల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన పెను భూకంపానికి వేలాది భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి, చెప్పనలవికానంత బీభత్సం దాపురించింది. 2600 అని మొదట్లో అనుకొన్న మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతూ మంగళవారం సాయంత్రానికి 5000కి చేరుకొన్నది. కూలిపోయిన భవనాలే 6000లకు పైగానే వుంటాయని చెబుతున్నారు. మహా పర్వతాలను పోలే ఆ ప్రాసాదాల శిథిలాలు ఇంకెన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నాయో వాటిని పూర్తిగా తొలగిస్తే గాని తెలియదు. భవనాలు కూలిపోయేటప్పుడు సంభవించే విద్యుదాఘాతాల వంటి ఉపద్రవాలు మృతుల సంఖ్యను మరింత పెంచుతాయి.

ఎత్తు నుంచి కింద పడిన కాంక్రీటు శ్లాబులు సృష్టించిన ప్రాణ నష్టం అసాధారణ స్థాయిలో వుంటుంది. అంతిమంగా మృతుల సంఖ్య ఇప్పుడున్న దాని కంటే అనేక రెట్లు ఎక్కువగా తేలే సూచనలే కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున జనం నిద్ర తీసే వేళ నెలకొన్న ఈ ఘోర విపత్తు సృష్టించిన మానవ విషాదాన్ని వివరించడానికి మాటలు చాలవు. 2001 జనవరిలో గుజరాత్ రాష్ట్రంలో సంభవించిన భూకంపం రిక్టార్ స్కేల్‌పై 7.9గా నమోదైంది. అందులో 20,000 మంది దుర్మరణం పాలయ్యారు. 2003 డిసెంబర్‌లో ఇరాన్‌లో ఇదే స్థాయిలో చోటు చేసుకొన్న భూకంపంలో 26,000 మంది చనిపోయారు. 2005 డిసెంబర్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 7.6 తీవ్రతలో సంభవించిన భూకంపానికి 73,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి టర్కీ సిరియా ఉపద్రవం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.8 గా నమోదైంది.

ఈ విధంగా చూసుకొన్నా ఇక్కడ జరిగిన నష్టం అపారంగానే వుంటుంది. చలి, వర్షం, మంచు కలగలిసిన వాతావరణం సహాయక చర్యల వేగాన్ని హరిస్తుంది. ఈ భూకంప కేంద్రాన్ని టర్కీలోని కరమన్మరాస్ రాష్ట్రంలో గుర్తించారు. పొరుగునున్న సిరియాలోనూ భారీ నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. టర్కీలోని దియార్బకిర్, ఇస్కెందెరన్ వంటి నగరాలు, సిరియాలోని అలెప్పో, హమా వంటి సిటీలు భూకంప తీవ్రతకు అధికంగా దెబ్బతిన్నట్టు వార్తలు చెబుతున్నాయి. భూకంపం ఎక్కువగా టర్కీనే తాకిందని సమాచారం. ఈ ప్రాంతం భూకంపాలకు ఎక్కువగా అవకాశాలున్నదని గతంలోనే గుర్తించారు. 1999లో టర్కీలో ఇక్కడే సంభవించిన పెను భూకంపానికి 19,000 మంది మరణించారు. ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్యదేశాల దౌత్య ప్రతినిధులు భూకంప మృతుల పట్ల సంతాప సూచకంగా మౌనం పాటించడం మానవీయతను చాటింది. కరోనా సమయంలో పొడసూపిన మాదిరి రాజకీయాలకు ఇటువంటప్పుడు సహజంగానే చోటు వుండదు.

భారత్ సహా అనేక దేశాలు సహాయక బృందాలను పంపిస్తుండడం హర్షించవలసిన పరిణామం. చాలా లోతున భూగర్భ ఫలకాలు జారి ఒకదానికొకటి తాకడంతో ఈ ప్రళయం చోటు చేసుకొన్నదని చెబుతున్నారు. దీనిని స్ర్టైక్ స్లిప్ భూకంపంగా పేర్కొంటున్నారు. ఎన్నో శాస్త్రీయ విజయాలు సాధించిన మనిషి భూకంపాన్ని మాత్రం పసికట్టలేకపోడం స్పష్టంగా కనిపిస్తున్న లోపం. ఇది ఇంకెంత కాలం కొరకరాని కొయ్య వంటి సవాలుగా కొనసాగుతుందో చెప్పలేము. ఆలోగా భూకంపాలను తట్టుకొని నిలవగలిగే భవనాలను నిర్మించే నైపుణ్యాన్ని పెంచుకొని పాటించాలి. ఈ విషయంలో జపాన్ సాధించిన ప్రగతి అనుసరించదగినది. మనిషి కాలి కింది భూమే కదిలిపోతే కాపాడే శక్తి వేరే ఏముంటుంది? విజ్ఞాన శాస్త్రపరమైన శోధనతోనే దీని రాకడను ముందుగా గమనించి అడ్డుకోగల శక్తిని సముపార్జించుకోవాలి. భూకంపాలు సంభవించడానికి ముందు ప్రకృతిలో కనిపించే కొన్ని మార్పుల ఆధారంగా వాటిని ముందుగా తెలుసుకోవచ్చనే సూత్రం కూడా ఫలిస్తున్న జాడలు లేవు.

చాలా కాలం క్రితం జంతువుల ప్రవర్తనలో వచ్చిన మార్పులను బట్టి ముందస్తుగా, సంభవించిన చిన్నచిన్న భూప్రకంపనల ఆధారంగానూ చైనాలో భూకంపాల రాగల అవకాశాలను గుర్తించారని చెప్పుకొన్నారు. అటువంటప్పుడు జనం ఆరుబయట నిద్రించడం ద్వారా భూకంప మృతుల సంఖ్యను పరిమితం చేయవచ్చు. ఇంతకీ భూకంపం గురించి ముందుగా తెలుసుకోడమనేదే ఇప్పటికీ సాధ్యం కావడం లేదు. ఇది తిరుగులేని వాస్తవం. భూపొరల్లోని కంపనలను బట్టి సమీప భవిష్యత్తులో పెను భూకంపం సంభవించగలదని నిర్ధారణకు రావడం సరైనది కాదని శాస్త్రజ్ఞులే చెబుతున్నారు. ఏది సరైన సంకేతమో మరింత లోతుగా శోధించి ప్రపంచానికి మేలు చేయవలసిన బాధ్యత వారిపైనే వుంది. ప్రస్తుతానికి టర్కీ, సిరియా భూకంపం సందర్భంగా వెల్లువెత్తుతున్న సానుభూతి, సహకారాలను చూసి ముచ్చటపడవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News