Thursday, January 23, 2025

తీరు మారని టర్కీ.. ఐరాసలో మళ్లీ కశ్మీర్ పాట

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి 78 వ సర్వసభ్య సమావేశాల్లో మరోసారి టర్కీ భారత్‌ను కవ్వించింది. ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆ దేశాధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన భారత్‌పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని ఈ వేదికపై ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యదేశంగా భారత్ కీలక పాత్ర పోషించడం ఎంతో గర్వకారణమని ఎర్డోగాన్ కొనియాడారు. ఈ క్రమం లోనే ఆయన కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు.

“ భారత్ పాకిస్థాన్‌లకు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ కశ్మీర్ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. నిజంగా ఇది దురదృష్టకరం. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనడం ఎంతో కీలకం. ఇది దక్షిణాసియాలో శాంతి సుస్థిరతకు బాట వేస్తుంది. రెండు దేశాలు చర్చలు జరపాలి. అప్పుడే కశ్మీర్‌లో శాంతియుత పరిష్కారం లభిస్తుంది. దీనికి టర్కీ మద్దతు ఇస్తుంది” అని ఎర్డోగాన్ అన్నారు. ఎర్డోగాన్ ఈ అంశాన్ని లేవనెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలో జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇలానే వ్యవహరించి విమర్శల పాలయ్యారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న 20 దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయని, ఆ ఐదు దేశాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా) మాత్రమే ప్రపంచం కాదని వ్యాఖ్యానించారు. మరో 15 దేశాలకు కూడా రొటేషన్ విధానంలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, ఐరాస సమావేశాలకు భారత ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయనకు బదులుగా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ హాజరవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News