రంగారెడ్డి : కమల దళంలో ఊపు తప్ప నైరాశ్యం కనిపిస్తుంది. వలసనేతలతో పార్టీ నిండటంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తాచాటుతామన్న ఆశలు అంతలోనే ఆవిరైపోతున్నాయి. వలస వచ్చే నేతల సంగతి దేవుడేరుగు పార్టీలో ఉన్న బడానేతలు సైతం తమ దారి తాము చూసుకోకపోతే నిండా మునుగుడు ఖాయం అన్న భావనకు వచ్చి పక్కచూపులు చూస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బిజెపిలో కీలకనేత మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీ వీడటం దాదాపు ఖాయమైంది. వికారాబాద్ నుంచి శాసనసభ్యుడిగా బరిలో ఉండటానికి గత సంవత్సరం కాలంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో తిరగడంతో పాటు పలు కార్యక్రమాలు చేసిన చంద్రశేఖర్ నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటు హస్తం పార్టీలో చేరడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో చేరి చెవెళ్ల నుంచి భరిలో దిగితే ఎలా ఉంటుందన్న దానిపై చెవెళ్ల నియోజకవర్గంలోని కీలకనేతలతో ఇప్పటికే మంతనాలు పూర్తి చేసిన చంద్రశేఖర్ ఆషాడ మాసం ముగిసిన వెంటనే బిజెపికి గుడ్‌బై చెప్పడం ఖాయమైంది.
చంద్రశేఖర్‌తో పాటు పలువురు బిజెపి కీలకనేతలు బిజెపి వీడటం ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన మాజీ ఎంపి సైతం డైలామాలోనే ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. బిజెపి రాష్ట్ర కార్యక్రమాలకు హాజరవుతున్న సదరు నేత నియోజకవర్గంకు మాత్రం దూరంగా ఉంటున్నారు. చెవెళ్ల పార్లమెంట్ నుంచి భరిలోకి దిగుతాడని అనుకుంటున్న సదరు నేత పార్లమెంట్ పరిధిలో పార్టీ పటిష్టత పై ఫోకస్ పెట్టక పోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబందాలు ఉండటంతో ఏ సమయంలోనైనా కాంగ్రెస్ తీర్దం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతుంది.
మాజీ మంత్రి తనయుడు, యువనాయకుడు సైతం బిజెపి వీడటం ఖాయమైందన్న ప్రచా రం జరుగుతుంది. మహేశ్వరం, ఉప్పల్ నియోజకవర్గాలలో ఒక్కచోట నుం చి ఆయనకు అవకాశం కల్పిస్తామని హస్తం నేతలు వేసిన గాలం ఆయన సైతం చిక్కినట్లు వినికిడి. ఉమ్మడి జిల్లాలో పలువురు కీలక బిజెపి నేతలు పక్కచూపులు చూస్తుండగా బిజెపిలో చేరేవారు మాత్రం కనిపించడం లేదు.
వర్గపోరుతో డీలా: ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బిజెపి గ్రూపులుగా విడిపోయింది. రాష్ట్ర పార్టీ కిషన్ రెడ్డి స్వంత గ్రామం ఉన్న మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ గ్రూపులుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గత ఎన్నికలలో పోటి చేసి పరాజయం పాలైన శ్రీరాములు యాదవ్ ఒకవైపు, జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డి మరోవైపు మరో కార్పొరేటర్ మరోవైపు ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహింపట్నంలో పార్టీ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంది. షాద్‌నగర్‌లో సైతం టికెట్ కోసం నాయకులు గ్రూపులుగా విడిపోయారు.
రాజేంద్రనగర్‌లో కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, శంషాబాద్‌కు చెందిన వేణుగోపాల్ , జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు టికెట్ ఆశీస్తు ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్.బి.నగర్‌లో అర్బన్ పార్టీ అధ్యక్షుడు రంగారెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్‌లు టికెట్ రేసులో ఉండగా పెద్ద నాయకులు సైతం దీనిపై కన్నెశారు. శేరిలింగంపల్లిలో ఎకంగా రెండు వర్గాలు రోడ్లపైనే బాహాబాహికి దిగడం…ముష్టి యుద్దాలు చేయడం పరిపాటిగా మారింది. వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి కనీసం ప్రత్యర్ధి పార్టీకి పోటి ఇచ్చే సీన్ కూడ కనిపించడం లేదు. పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూర్‌లో నాయకులు చాలా మంది ఉన్న గ్రామానికి తక్కువ….మండలానికి ఎక్కువ కాని అందరికి ఎమ్మెల్యే టికెట్‌లు కావాలని డిమాండ్ చేసేవారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. బిఆర్‌ఎ, కాంగ్రెస్‌కు కనీసం పోటి ఇచ్చే నాయకులు మాత్రం నాలుగు నియోజకవర్గాలో లేరని చెప్పవచ్చు.