ప్రముఖ టెలివిజన్ నటి డాలీ సోహి శుక్రవారం కన్నుమూశారు. తన సోదరి అమన్ దీప్ సోహీ మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే డాలీ కూడా చనిపోవడం విషాదకరం. అక్కచెల్లెళ్లు ఇద్దరూ నటులే. అమన్ దీప్ కొంతకాలంగా కామెర్లతో అవస్థపడుతోంది. కాగా గత ఏడాదినుంచీ డాలీ గర్భాశయ ముఖద్వార కాన్సర్ తో బాధపడుతోంది. వీరిద్దరూ న్యూ ముంబయిలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమన్ దీప్ గురువారం సాయంత్రం మరణించగా, డాలీ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్నుమూసిందని వారి సోదరుడు మన్ను సోహి తెలిపారు.
డాలీ గత ఏడాది తాను కీమోథెరపీ చేయించుకుంటున్న సమయంలో ఒక ఫోటోను గతంలో షేర్ చేశారు. ‘మీలో పోరాటపటిమ ఉంటే జీవనప్రయాణం సాఫీగానే ఉంటుంది. పోరాడి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలో లేక కుంగిపోయి, వ్యాధికి లొంగిపోవాలో మీరే నిర్ణయించుకోవాలి’ అంటూ ఆమె అప్పట్లో పోస్ట్ చేశారు. మేరీ ఆషికీ తుమ్సే హి, ఝనక్, ఖూబ్ లడీ మర్దానీ… ఝాన్సీ కీ రాణీ వంటి సీరియళ్లలో డాలీ నటించారు.